మూడేళ్ల వయసులో మాటలు రావడమే చాలామందికి కష్టం. అమ్మ, అత్త, మామ.. అంటూ ముద్దుముద్దుగా మాట్లాడటమే కాదు, ఆ పిల్లవాడు మూడేళ్లకే హ్యారీ పోటర్ పుస్తకాలు చదివేస్తున్నాడు. అంతేకాదు, ఇతర రచయితల పుస్తకాలు కూడా అలవోకగా అప్పజెబుతాడు. వాడి ఐక్యూ లెవల్స్ మామూలుగా లేవు. ఏదైనా చూశాడంటే కంఠతా పట్టేస్తాడు. ఎక్కడ నుంచి అడిగినా చెప్పేస్తాడు.
నెంబర్లలో ఆటాడేసుకుంటాడు..
1నుంచి 100 వరకు అంకెల పేర్లను తన మాతృ భాష ఇంగ్లిష్ లోనే కాకుండా మరో 6 భాషల్లో చెప్పేస్తాడు హాబ్స్. ఈ చిన్నారి వయసు జస్ట్ 3 సంవత్సరాల 9నెలలు మాత్రమే. సోమర్ సెట్ ప్రాంతం నుంచి తల్లిదండ్రులు బెత్, విల్ హాబ్స్ తో పాటు బ్రిటన్ వచ్చేశాడు హాబ్స్.
అతడిని ఇప్పుడు మెన్సా మెంబర్ గా చేర్చుకున్నారు. అత్యథిక ఐక్యూ కలిగినవారికి మాత్రమే మెన్సాలో మెంబర్ షిప్ ఇస్తారు. 98శాతం ఐక్యూ లెవల్స్ తో ఈ మెంబర్ షిప్ ని మూడేళ్లకే పొందిన బుడతడుగా హాబ్స్ రికార్డ్ సృష్టించాడు.
ఓసారి హాబ్స్ ని స్కూల్ కి రెడీ చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు అతడి ప్రతిభ తెలిసొచ్చింది. ఆ తర్వాత ఓ సందర్భంలో ఐక్యూ టెస్ట్ లో మనోడు అదిరిపోయే ఆన్సర్లు ఇచ్చి నిర్వాహకులకు షాకిచ్చాడు. ఆ తర్వాత మెల్లగా అతడి అలవాట్లు, అభిరుచులు మారాయి. దానికి తగ్గట్టే తల్లిదండ్రులు కూడా ట్రైనింగ్ ఇచ్చారు. తమకి ఆయా భాషలు రాకపోయినా నేర్చుకుని మరీ కొడుక్కి ఏడు భాషల్లో అంకెలు నేర్పించారు. ఇంగ్లిష్ తోపాటు, మాండరిన్, వెల్ష్, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ భాషల్లో కూడా అంకెలు చెబుతాడు హాబ్స్.
అయితే తమ కొడుకు భవిష్యత్తులో ఏమవుతాడో ఇప్పుడే చెప్పలేమంటున్నారు తల్లిదండ్రులు. అతడిలో సుపీరియారిటీ కాంప్లెక్స్ పెరగకుండా చూస్తామంటున్నారు. మెన్సాలో మనోడు మరింత రాటుదేలుతాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.