తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి కొన్నాళ్ల ముందు ఈవీఎంల మీద యుద్ధం ప్రకటించారు. 2019 లోక్ సభ సార్వత్రిక ఎన్నికలను కానీ, ఏపీ అసెంబ్లీ ఎన్నికలను కానీ… ఈవీఎంల మీద నిర్వహించడానికి వీల్లేదంటూ అప్పట్లో ఆయన ఒక ఉద్యమమే నడిపించారు తన సాటి రాజకీయ పార్టీలతో కలిసి!
వాస్తవానికి ఈవీఎంల మీద ఎన్నికలు జరగడం అదే తొలి సారి కాదు. 2004, 2009, 2014 లలో లోక్ సభ, ఏపీ అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలన్నీ ఈవీఎంల మీదే జరిగాయి. వీటిల్లో 2014లో టీడీపీ ఏపీలో అధికారాన్ని కూడా పొందింది. ఈవీఎంల మీద జరిగిన ఎన్నికల్లోనే టీడీపీ అప్పుడు మెజారిటీని పొంది విజయాన్ని సొంతం చేసుకుంది. మరి తాము గెలిచినప్పుడు ఈవీఎంల మీద ఉన్న నమ్మకం… ఓటమి భయం ఉన్నప్పుడు మాత్రం లేకపోయింది!
చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి తప్పదనుకనే ఆ రచ్చ చేశారు. ఆయన లెక్కే రైటైంది. టీడీపీ చిత్తు అయ్యింది. అయితే ఒక్కసారి ఎన్నికల ఫలితాలు వచ్చాకా.. చంద్రబాబు నాయుడు మళ్లీ ఈవీఎంలను నిందించలేదు. కేంద్ర ఎన్నికల సంఘం మీద అప్పటి వరకూ ఒంటికాలి మీద లేచిన చంద్రబాబు ఎన్నికల ఫలితాలు వచ్చాకా మాత్రం ఈవీఎంలను అనుమానిస్తూ చిన్నపాటి ప్రకటన చేయలేదు. అదీ చంద్రబాబు ధైర్యం!
కేంద్రంలో మోడీ సర్కారు రెండోసారి రావడంతో.. చంద్రబాబు ఈవీఎంల మీద కిక్కురుమనలేకపోయారు. అలా ఏదైనా అంటే.. తనను తీసుకెళ్లి లోపలేస్తారనే భయం చంద్రబాబుకు ఉండవచ్చు!
అలా ఈవీఎంల మీద కిక్కురమనకుండా అప్రకటిత విశ్వాసాన్ని ప్రకటించేశారు. ఇక ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ అంతా బ్యాలెట్ పేపర్ల మీద జరిగింది. జరుగుతోంది. మున్సిపల్- కార్పొరేషన్ ఎన్నికలు, పంచాయతీలు, జడ్పీటీసీ- ఎంపీటీసీ ఎన్నికలు.. ఇవన్నీ వరసగా బ్యాలెట్ పేపర్ల మీద జరిగాయి. వీటిల్లో క్రమం తప్పకుండా టీడీపీ చిత్తయ్యింది.
మరి ఈ ఓటములకు టీడీపీ చెబుతున్న సాకు.. దొంగ ఓట్లు! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను వేయించుకుని గెలుస్తోందని, అదో విజయం కాదంటూ.. చంద్రబాబు ఇటీవలే వ్యాఖ్యానించారు కూడా. ఇక ఇప్పుడు కుప్పంలో చిత్తైన నేపథ్యంలో కూడా అదే వాదనే చంద్రబాబు అండ్ కో వినిపిస్తుందనడంలో కూడా సందేహం లేదు!
ఓటమిని ఒప్పుకుంటే.. గెలుపుకు ప్రణాళిక రచించవచ్చు ఎవరైనా. అయితే తమది ఓటమే కాదనుకుంటే.. ఇక గెలుపు అనేది కలే! సరిగ్గా టీడీపీ ఇదే స్థితిలో ఉంది. ఓటమిని ఒప్పుకుని పొరపాట్లను సరిదిద్దుకుంటామనే ప్రకటన.. 2019 ఎన్నికల్లో ఓడినప్పుడు కానీ, ఆ తర్వాత ఉప ఎన్నికల్లో- స్థానిక ఎన్నికల్లో చిత్తయినప్పుడు కానీ.. చిన్నపాటి ప్రకటన రాలేదు చంద్రబాబు నుంచి. అది ఓటమే కాదని అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ఒక గెలుపు కాదంటూ తమ అహాన్ని చల్లార్చుకుంటున్నారు. దీని వల్ల చంద్రబాబు, లోకేష్, వీరి వీర భక్తుల అహం చల్లారు తుందేమో కానీ, టీడీపీ పై ప్రజల్లో మాత్రం విశ్వాసాన్ని కలిగించదని కచ్చితంగా చెప్పవచ్చు.