‘పేషన్’ సినిమా ప్రపంచంలో ఈ మాటను కొన్ని వందల మంది చెబుతుంటారు. ఈ సినిమాను మేం చాలా పేషన్ తో చేశాం అంటుంటారు. కానీ ‘పేషన్’ అనే పదానికి అసలు సిసలు నిర్వచనం చిరంజీవి.
మెగాస్టార్ లాంటి కితాబులన్నీ కాసేపు మర్చిపోండి. సుమారు నాలుగు దశాబ్దాల కిందట మొదటిసారి కెమెరా ముందు నిల్చున్న మొగల్తూరి కుర్రాడిలో ఎలాంటి శ్రద్ధ ఉన్నదో.. ఇవాళ్టికీ అదే శ్రద్ధ, అదే అంకిత భావం. చేస్తున్న పని మీద మాత్రమే దృష్టి. అందుకే ఆధునిక యువతరం కుర్ర హీరోలు, కొంచెం ముదురు హీరోలు ఏ ఒక్కరికీ సాధ్యం కాని మ్యాజిక్ ను ఈ వెట.. హీరో సాధిస్తున్నాడు. కలెక్షన్ల సునామీలు సృష్టిస్తున్నాడు.
చిరంజీవిని వెటరన్ హీరో అంటే పాపం సోకుతుంది! కెమెరా ముందు భయభక్తుల్లో కుర్రహీరోలు, సినిమా చేయడం పట్ల శ్రద్ధాసక్తుల్లో ముదురు హీరోలు ఏ ఒక్కరూ సాటిరాని ఈ చిరంజీవి.. ఎప్పటికీ హీరో! అంతే!!.. చిరంజీవే ఈవారం గ్రేట్ ఆంధ్ర స్పెషల్ స్టోరీ
యతో హస్తః తతో దృష్టిః
యతో దృష్టిః తతో మనః
యతో మనః తతో భావో
యతో భావః తతో రసః
హస్తమున్నచోట దృష్టి ఉండాలి, దృష్టి ఉన్నచోట మనసు లగ్నంకావాలి, మనసు లగ్నమైనచోట భావం ఉండాలి. ఇలా భావం ఉన్నచోట రసం తప్పక ఉంటుంది.. అని అభినయ దర్పణంలోని ఈ శ్లోకం భావం. చేసే పని మీద పూర్తి స్థాయిలో మనసు లగ్నం చేసినప్పుడే రసోత్పాదన ఉంటుందనే సత్యాన్ని ఈ శ్లోకం చెబుతుంది. ఇది అభినయానికి సంబంధించినదే అయినా.. ఈ సందేశం ఇతరత్రా కూడా వర్తిస్తుంది. ఒక పని మీద తదేక దీక్షతో మనసు లగ్నం చేయడం అనేది కార్యసాఫల్యతకు, అద్వితీయ విజయానికి ఏకైకదారి.
ఒక నాలుగేళ్ల పసిపిల్లవాడు బంకమట్టితో బొమ్మలు తయారుచేస్తున్నాడనుకోండి. చేతులు మొత్తం మురికిమురికి అయిపోతాయి. బట్టలకు కూడా మట్టి పులిమేసుకుంటాడు. వాడు ఆ బంకమట్టితో అద్భుతమైన కళాఖండాలను తయారుచేశాడా? వంకర టింకరగా చేశాడా? అనే సంగతి పక్కన పెట్టండి. ఆ పనిచేస్తున్నంతసేపూ ఎంతటి తదేకదీక్షతో అందులో నిమగ్నం అయ్యాడో గమనించండి. ‘తను- మట్టి’ అంతే! చుట్టూ ఏం జరుగుతోందో పట్టించుకోడు! బాహ్యస్పృహ ఉండదు! తనని చూసి ఎవరైనా నవ్వుకుంటున్నారో లేదో గమనించడు. తాను చేయదలచుకున్న బొమ్మ అందంగా తయారవుతుందా లేదా పట్టించుకోడు. కానీ చాలా శ్రద్ధగా, ఒక రకమైన తాదాత్మ్యతతో, తదేక దీక్షతో చేసుకుంటూ పోతాడు. చేస్తున్న పని పూర్తయిందని వాడికి అనిపించిన తర్వాత.. ఆ బొమ్మని చూసుకుని ఒక అలౌకికమైన ఆనందాన్ని అనుభూతిస్తాడు. చేసే పనిలో దీక్షను, పొందిన ఫలితంలో ఆనందాన్ని కొలవడానికి కొలబద్ధలుండవు. పసిపిల్లవాడికి మాత్రమే సాధ్యమయ్యే దీక్ష- ఆనందం అది! పసితనంలో మాత్రమే ఉండే గొప్పతనం అది. ఆ ‘పసితనం’ తన వ్యక్తిత్వంలో ప్రాథమిక లక్షణంగా, బలమైన లక్షణంగా ఉన్న హీరో చిరంజీవి.
ప్రేమించడం అనే చిన్న పదం సరిపోదు.. చేసే పనిని మోహించే లక్షణం మౌలికంగా ఉండాలి. ప్రేమ, మోహాలకు కూడా అతీతమైన అనురక్తి ఉండాలి. తపన ఉండాలి. ఆ ఒక్క పనిని తప్ప మరేమీ పట్టించుకోని తత్వం ఉండాలి. ఈ లక్షణాలు అన్నీ ఒకే వ్యక్తిలో, జీవితపర్యంతమూ సమానంగా ఉండడం అసాధ్యం. అలా ఉన్నవారు అరుదుగా కూడా మనకు దొరకరు. తెలుగు సినిమా రంగాన్ని గమనిస్తే.. అలాంటి ఒకే ఒక్క హీరో– చిరంజీవి.
ఒక చిన్న ముచ్చట చెప్పుకోవాలి. కాస్త లేటుగా విడుదలైనా చిరంజీవి మొదట కెమెరా ఎదుటకు వచ్చిన చిత్రం పునాదిరాళ్లు. చిరంజీవిది చాలా చిన్న పాత్ర. హీరో కాదు. తనమీద చిత్రీకరిస్తున్న మొదటి సీన్ .. పొలం పని నుంచి ఇంటికొచ్చిన నలుగురు మిత్రులు కాళ్లు కడుక్కుని ఇంట్లోకి వెళ్లాలి. హీరో తల్లి పాత్ర ఆ నలుగురికి భోజనం పెడుతుంది. కాళ్లు కడుక్కోడానికి పొలంనుంచి వచ్చిన నలుగురూ వరుసగా ఫ్రేంలో నిలుచున్నారు. ముందున్న వాళ్లు కాళ్లు కడుక్కునే దాకా తాను ఏం చేయాలి? ఖాళీగా అలా నిల్చుంటే బాగుంటుందా? కాళ్లు కడుక్కోమని చెప్పారు తప్ప.. మిగిలిన వాళ్లు కడుక్కునే సమయంలో సింక్ అయ్యేలా ఏం చేయాలో దర్శకుడు గూడపాటి రాజకుమార్ చెప్పలేదు. కానీ వారిలో చివర్న ఉన్న చిరంజీవి పొలం పని నుంచి వచ్చినట్టుగా భుజం మీద కాసిని గడ్డిపరకలు తానే వేసుకుని.. ముందున్న వాళ్లు కడుక్కుంటూ ఉండగా.. తాను వాటిని దులుపుకుంటూ ఒక యాక్టివిటీలో ఉన్నట్టుగా ఫ్రేంలో కనిపించారు. ఆయన వ్యవహారాన్నంతా కెమెరామెన్ పిఎస్ నివాస్ గమనించారు. షాట్ ఓకే అయిన తర్వాత.. ‘నీకు మంచి శ్రద్ధ ఉంది.. మంచి భవిష్యత్తు ఉంటుంది’ అని చెప్పారట. పనిలో మమేకం అయిపోయి, ఒక పేషన్‌తో పనిచేసేప్పుడు మాత్రమే.. అలాంటి శ్రద్ధ పెట్టడం సాధ్యం అవుతుంది.
నలభైనాలుగేళ్ల కిందటి షూటింగ్ ముచ్చట ఇది. ఇవాళ కూడా సెట్లో చిరంజీవిని గమనించండి. చేస్తున్న పని పట్ల అదే పేషన్, అదే మోహం, అదే శ్రద్ధ, అదే అంకిత భావం.. ‘అంతేస్థాయి’లో కనిపిస్తాయి. దటీజ్ చిరంజీవి. మెగాస్టార్ అయిపోయాను గనుక ఎలా చేసినా చెల్లుతుందనే పొగరు ఆయనలో ఎప్పటికీ కనిపించదు.
శిఖరాలు ఎక్కడం ఈజీ కాదు..
శిఖరాలు అధిరోహించడం అంటే అంత సులువైన సంగతి కాదు. తన పునాదులను తానే తొలుచుకుంటూ, తన ప్రస్థానాన్ని తానే మలచుకుంటూ ఎదిగిన వ్యక్తి చిరంజీవి. కెరీర్ చాలా చిన్న పాత్రలతోనే మొదలైంది. నెగటివ్ పాత్రల మీదుగా ప్రస్థానం సాగింది. ఈ తరం కుర్రకారు చిరంజీవి నెగటివ్ పాత్రలు చేసిన చిత్రాలు చూశారంటే అసహ్యించుకుంటారు. అంత ఘోరంగా ఉంటాయి ఆ పాత్రలు. తనకు వచ్చిన పాత్ర ఏదనేది కానే కాదు. ఆ పాత్రలో తాను పూర్తిగా ఒదిగిపోయానా లేదా? అనేది మాత్రమే పట్టించుకునే హీరోలు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి నటుడు చిరంజీవి. నెగటివ్ పాత్రలు వేసినా, చిన్న పాత్రలు చేసినా, హీరోగా ఎదిగినా, మెగాస్టార్ అయినా ఆ శ్రద్ధ అలాగే ఉండిపోయింది.
‘వాల్తేర్ వీరయ్య’ ఆ విషయాన్ని తాజాగా మరోసారి ప్రపంచానికి నిరూపించాడు. చిరంజీవితో చిత్రాలు తీసేవాళ్లు ఓ సంగతి గుర్తుంచుకోవాలి. ఇదివరకటి పాత్రలను మక్కీ మక్కీగా దించేయకుండా కొంచెం కొత్తదనం ప్రయత్నించండి. కనీసం, ఇటీవలి చిత్రాల్లోని పాత్రలకు భిన్నమైన పాత్రను తయారు చేయండి. సక్సెస్ గ్యారంటీ.
ఖైదీ నెంబర్ 150 ఆయన రీఎంట్రీని చాలా ఘనంగా ఢంకా బజాయించి తెలుగు ప్రేక్షకలోకానికి ప్రతిధ్వనింపజేసి ఉండొచ్చు. సైరా ఇచ్చిన సక్సెస్ ను ఆచార్య, గాడ్ ఫాదర్ అందుకుని ఉండకపోవచ్చు. వాల్తేర్ వీరయ్య ఈ రికార్డులన్నింటినీ తిరగరాయవచ్చు.. రాయకపోవచ్చు! కానీ, ఈ చిత్రాల్లో పరస్పర విభిన్నమైన పాత్రలు తన వద్దకు వచ్చినప్పుడు.. అన్నింటినీ కలిపి అవలోకిస్తే మెగాస్టార్ విశ్వరూపమే మనకు కనిపిస్తుంది. అన్ని రకాల పాత్రలకూ పరిపూర్ణమైన న్యాయంచేసిన నటుడు మనకు కనిపిస్తాడు. సినిమా ఫలితాలు ఏవైనా తేడా అయి ఉండొచ్చు గానీ, నటుడిగా చిరంజీవి లోపం కాదు కదా, అశ్రద్ధ కూడా కనిపించదు.
సినిమాలు ఫ్లాప్ కావొచ్చు..
సినిమా నటులు, రూపకర్తలు మానవాతీత శక్తులు కాదు. దివినుంచి దిగివచ్చిన వాళ్లు కాదు. వాళ్ల చేతిలో మంత్రదండం ఉండదు. ఘన విజయాలను ఎలా నమోదు చేస్తారో.. కొన్ని పరాజయాలు కూడా వారిని అలాగే పలకరిస్తాయి. కానీ సినిమా పరిశ్రమను సన్నిహితంగా పరిశీలించే వారికి ఒక విషయం అర్థమవుతుంది. సినిమా కథను హీరోకు చెప్పి ఒప్పించే క్రమం ప్రతి సందర్భంలోనూ గొప్పగానే ఉంటుంది. కథ మంచిగా తయారవుతుందనే తొలి దశలో అందరూ అనుకుంటారు. ఖచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకంతోనే ప్రారంభిస్తారు. కానీ నిర్మాణంలో కొంతదూరం వెళ్లిన తర్వాత కొన్ని సినిమాలు గతి, లయ తప్పుతుంటాయి. అందుకు అనేక కారణాలు ఉంటాయి. స్క్రిప్టు పూర్తిగా సిద్ధం చేసుకోకుండా పని మొదలుపెట్టడం కావొచ్చు, కొంత పని చేసిన తర్వాత స్క్రిప్టు మార్చాలనే ఆలోచనలతో కంగాళీగా కెలికేయడం కావొచ్చు, దర్శకుడు కథను మాటల్లో చెప్పినంత పక్వంగా దృశ్యీకరించడంలో ప్రతిభ చూపలేకపోవచ్చు.. ఇలా అనేక కారణాలుంటాయి.
సినిమా సక్సెస్ అయ్యేలా లేదనే సంగతి.. కొంత షూటింగ్ తర్వాత తెలిసిపోతుంది. ఏవో ఊరూపేరూ లేని హీరోల సినిమాలైతే.. అక్కడితో ఆ ప్రాజెక్టును చెత్తబుట్టలో పడేస్తే, కనీసం నిర్మాత పోయిన డబ్బుకు నీళ్లు వదలుకుని సేఫ్ అవుతాడు. కానీ పెద్ద హీరోల సినిమాలు అలా కాదు. సినిమా తమ చేయి జారిపోతోందని అర్థమయ్యే సమయానికే చాలా పబ్లిసిటీ జరిగిపోయి ఉంటుంది.
ప్రతి పెద్ద హీరో సినిమా కూడా, ఒక రకంగా పులి సవారీ లాంటిదే! సవారీని పూర్తిచేయాల్సిందే తప్ప మధ్యలో దిగడానికి సాధ్యం కాదు. పెద్ద హీరో సినిమా ఆగిపోతే ఇమేజి గాయపడడం అనేది మామూలుగా ఉండదు. అందుకని మొక్కుబడిగా అయినా దానిని పూర్తిచేసేస్తారు. వచ్చినంత సొమ్ము వస్తుందిలే అని సర్దుకుంటారు. ఈ దశలోనే అసలు సిసలు నటుడి లక్షణం బయటపడేది. సాధారణంగా ‘ఇక ఈ సినిమా ఆడదు’ అని అర్థమైపోయిన తర్వాత.. దాదాపుగా అంతా రిలాక్స్ అయిపోతారు. చాలా మంది హీరోలు, షూటింగ్ ఆ దశకు వచ్చాక ‘ఇక ఎలా చేస్తే ఏముందిలే’ అని మొక్కుబడిగా లాగిస్తారు. కానీ మనం గమనిస్తే.. చిరంజీవి సినిమాల్లో అలాంటివి మచ్చుకు కూడా కనిపించవు. కెరీర్లో సూపర్ ఫ్లాప్ సినిమాలు ఉండొచ్చు. కానీ వాటిలో చిరంజీవి నటన పరంగా వంక పెట్టలేం. సినిమా ఫ్లాప్ అవుతుందని ముందే అర్థం కావొచ్చు గాక.. కానీ ఆ ఫలితం కోసం కాకుండా, చేస్తున్న పని కోసమే తపించే వ్యక్తిత్వం చిరంజీవిది. All that I can give అన్నట్టుగా.. పాత్ర ఎలాంటిదైనా, ఫలితం ఎలా ఉంటుందని అనిపించినా.. తాను చేయగలిగినంత పరిపూర్ణమైన ప్రయత్నం చేయడం చిరంజీవి లక్షణం.
రాజకీయ గ్రహణకాలం..
చిరంజీవి గురించి చెప్పుకుంటూ రాజకీయం జోలికి వెళ్లకపోతే తప్పే! ప్రజారాజ్యం తొలిఅడుగులు పరిమితమైన సక్సెస్ ను నమోదు చేయడం, కాంగ్రెస్ లో విలీనం, కేంద్రమంత్రిగా పదవికే వన్నెతెచ్చిన ప్రవర్తన.. ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ప్రజారాజ్యం సారధిగా.. ప్రజలు ఆశీస్సులు కోరుతూ ఆయన ఎన్నికల గోదాలోకి దిగారు. ‘‘రాజశేఖర రెడ్డి గారు కూడా బాగానే చేస్తున్నారు, నన్ను నమ్మండి. నేను ఇంతకంటె మంచి, నిజాయితీగల పాలనను అందిస్తాను’’ అని ప్రచారం చేశారు చిరంజీవి. అంతటి అమాయక నాయకుడు.. ఈ తరంలో ఎవరుంటారు? రాజకీయ ప్రత్యర్థులను పచ్చిబూతులు తిడుతూ, జుగుప్సాకరమైన మాటలతో టీవీ ఛానెళ్లు చూడాలంటేనే చీదర పుట్టేలా చేసే నాయకులున్న రోజుల్లో.. ‘ప్రత్యర్థి కూడా బాగానే పనిచేస్తున్నాడు’ అంటూ ఎన్నికల ప్రచారం చేసే నిజాయితీ మనకు ఎక్కడ కనిపిస్తుంది? అసాధ్యం!
అంతటి నిజాయితీని మన వర్తమాన భారతం భరించే స్థితి లేదు. ఆ సంగతిని గుర్తించడానికి చిరంజీవికి కొన్నేళ్లు పట్టింది. ఏ పనిచేసినా పరిపూర్ణమైన శ్రద్ధతోనే చేయాలని విశ్వసించే చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక సినిమా నటనను మానుకున్నారు. కానీ అది తనకు సరిపడని రంగం అని గుర్తించిన తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లి తిరిగి సినిమాల్లోకి రావడాన్ని ఎవరైనా ఎద్దేవా చేసి ఉండొచ్చు గాక.. కానీ ఆయన పట్టించుకోలేదు. ముందే చెప్పినట్టు, ఒకసారి మళ్లీ కెమెరా ముందుకు రాగానే ఇక చిరంజీవికి బాహ్యప్రపంచం కనిపించదు, ఆ స్పృహ ఉండదు. ‘ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలియడమే’ ముఖ్యం అనే నీతిని ఆయన ఆచరణలో చూపించారు.
చిరంజీవి సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల.. ఆయన ఫ్యాన్స్ చాలా మిస్ అయ్యారని అంతా అనుకున్నారు. కానీ నిజం చెప్పాలంటే.. ఆ రాజకీయ గ్రహణ కాలంలో.. చిరంజీవి తనను తాను మిస్ అయ్యారు. తన అంతఃచైతన్యాన్ని మిస్ అయ్యారు. తనలో ఉన్న జీవలక్షణాన్ని తాను మిస్ అయ్యారు. అందుకే, తిరిగి సినిమాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకోగానే.. ఆయనలోని నిత్యచైతన్య స్వరూపానికి ప్రతిస్పందనగా సినిమా పరిశ్రమ అక్కున చేర్చుకుంది. నెత్తిన పెట్టుకుంది.
‘వాల్తేర్ వీరయ్య’ చిరంజీవి ఎనర్జిటిక్ నటనకు పరాకాష్టగా నిలిచిన చిత్రం మాత్రమే కాదు. అలాంటి పాత్రలో, అంతే స్థాయి శ్రద్ధతో ఒదిగిపోయి తన వ్యక్తిత్వ లక్షణాన్ని మరో మారు నిరూపించుకునేట్లు చేసిన చిత్రం. చిరంజీవి వ్యక్తిత్వంతో యువతరానికి అనేక విషయాల్లో ఒక గైడ్ లాగా ఉపకరిస్తారు. చేసే పనిపట్ల పేషన్, అపరిమితమైన శ్రద్ధ విషయంలో కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ఒక ప్రత్యేక అధ్యాయంగా గుర్తించాలి.
చిరంజీవి అనే పదం కేవలం ఒక పేరు కాదు. వ్యక్తిత్వపరంగా అనేక అద్భుత లక్షణాల సమన్వయరూపానికి నిర్వచనం.
చిరంజీవి అంటే.. యాక్టర్ కాదు యాక్షన్!, కేరక్టర్ కాదు కేరక్టరెస్టిక్!, వ్యక్తి కాదు వ్యక్తిత్వం!
తెలుగుభాషా నిఘంటువుల్లో ‘చిరంజీవి’ అనే కొత్త పదాన్ని జోడించండి. అపరిమితమైన, ఎన్నటికీ సడలని పట్టుదల, శ్రద్ధ, కార్యదీక్షల సమన్వయరూపాన్ని ఒకే పదంలో నిర్వచించడానికి దానిని వాడండి. పనిని ప్రేమిస్తూ కష్టపడే యువతరాన్ని ‘చిరంజీవి’ అని దీవించండి
-కె.ఎ. మునిసురేష్ పిళ్లె (సీనియర్ పాత్రికేయుడు)