గద్దల కొండ గణేష్ తరువాత హీరో వరుణ్ తేజ్ క్రేజీ ప్రాజెక్టు గని. వరుసగా సినిమాలు వుండడం, సరైన డేట్ దొరక్కపోవడంతో మార్కెటింగ్ సమస్యగా వుంది. డిసెంబర్ 2న వద్దాం అనుకున్నపుడు వ్యవహారం బాగుంది. కానీ అక్కడ అఖండ రావడంతో సమస్య మొదలైంది.
డేట్ ను డిసెంబర్ 24కు మార్చారు. ముందు వారం పుష్ప వుండడం, అదే రోజు శ్యామ్ సింగ రాయ్ వుండడంతో సమస్య పెరిగింది. ఆ తరువాత దగ్గరలో ఆర్ఆర్ఆర్ కూడా వుంది. దీంతో గని కోట్ చేస్తున్న రేట్ కు బయ్యర్లు ముందుకు రావడం లేదని బోగట్టా.
ఆంధ్ర ఏరియాకు దగ్గర దగ్గర 15 కోట్లు కోట్ చేస్తున్నారు. వరుణ్ తేజ్ గద్దెల కొండ గణేష్ టోటల్ కలెక్షన్లు ఈ రేంజ్ కు కాస్త దగ్గరలో వున్నాయి. అయితే ఇప్పటికే ఫిక్స్ అయి వున్న సినిమాలకే అడ్వాన్స్ లు వస్తాయా? రావా? అన్న అనుమానాలతో వుండడంతో బయ్యర్లు ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర ఏరియా అయితే ఏకంగా మూడు కోట్లకు పైగా కోట్ చేయడంతో బయ్యర్లు మాట్లాడలేదని బోగట్టా. నిజానికి సినిమాలో భాగస్వామి గీతా అరవింద్ తనయుడు బాబి. అందువల్ల తలుచుకుంటే నేరుగా ఓన్ రిలీజ్ చేసుకోగలరు. అయితే వీలయినంత వరకు అమ్మడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.