దర్శకుడు క్రిష్ అర్జెంట్ గా ఓ సినిమాను చకచకా తీసేస్తున్నారు. వికారాబాద్ అడవుల నేపథ్యంలో ఓ లయిన్ కింగ్ టైపు సిజి వర్క్ ఎక్కువగా వుండే సినిమా ఒకటి చేసేస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాల్సి వుంది. దానికి కాస్త టైమ్ వుండడంతో ఈ సినిమా స్టార్ట్ చేసారు.
ఈ సినిమాలో అడవి, పులి వగైరా జంతువులు ఇలాంటి స్టోరీ అని ఇప్పటికే బయటకు వచ్చింది. ఇప్పుడు మరో సంగతి తెలుస్తోంది. కొండపొలం అనే మాంచి నవల ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారని తెలుస్తోంది. ఈ నవలకు తానా సంస్థ రెండు లక్షల రూపాయల బహుమతి ఇచ్చింది. గిరిజనులు కొండల మీదే చేసే వ్యవసాయం, ఆ వ్యవసాయం కోసం జంతువులతో, వాతావరణంతో పడే ఇబ్బందులు వగైరా విషయాలతో ఈ నవల వుంటుందని తెలుస్తోంది.
సన్నపురెడ్డి వెంకటరామి రెడ్డి అనే రచయిత ఈ నవల రాసారు. దీని హక్కులు తీసుకుని, దీని ఆధారంగానే క్రిష్ సినిమా చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు. అతనికి ఇధి రెండో సినిమా. మొదటి సినిమా ఉప్పెన విడుదలకు రెడీగా వుంది.