తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్ష పదవి అచ్చెన్నాయుడుకేనట, చంద్రబాబు వద్ద చాలా మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట, అచ్చెన్నాయుడికే ఆ పదవి ఇవ్వాలని వారంతా ముక్తకంఠంతో చెప్పారట, దీంతో చంద్రబాబు కూడా ఆ పదవిని ఆయనతోనే అలంకరించాలని డిసైడ్ చేశారట, ఈ మేరకు చంద్రబాబు అనుకూల మీడియా వర్గాలు లీకులు ఇస్తున్నాయి!
అసలే బెయిల్ మీద విడుదలై చాలా మంట మీద ఉంటారు అచ్చెన్నాయుడు, బహుశా ఆయనను కూల్ చేయడానికి ఉన్న ఫలంగా ఈ పదవిని ఇస్తున్నట్టుగా ఉన్నారు. ఇన్నాళ్లూ అచ్చెన్నాయుడి పేరు ఈ పదవి విషయంలో వినిపించనే లేదు. అక్కడకూ అచ్చెన్నాయుడు అన్న కొడుకు పేరైనా ఈ విషయంలో వినిపించింది కానీ, ఉన్న ఫలంగా ఆ పదవిని అచ్చెన్నాయుడుకు ఇవ్వనున్నారట!
అయితే తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ విభాగం అధ్యక్షుడు అనేది ఆరో వేలు లాంటి పదవే అని వేరే చెప్పనక్కర్లేదు. టీడీపీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉండనే ఉన్నారు. 13 జిల్లాల పార్టీకి జాతీయాధ్యక్షుడు ఒకరు, రాష్ట్ర అధ్యక్షుడు మరొకరు! చిన్నబాబు రుబాబు అదనం!
అధ్యక్షులు ఎక్కువై పోయి, పార్టీ చిన్నదైపోయినట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఆ ఆరోవేలుగా ఇప్పుడు అచ్చెన్నాయుడును నియమించి, చంద్రబాబు నాయుడు ఆయనకు గొప్ప గౌరవాన్ని ఇవ్వబోతున్నారట!