లాక్డౌన్…. ఈ పేరు వింటే వణికిపోతారు. కరోనా పుణ్యమా అని కొన్ని నెలల పాటు యావత్ ప్రపంచమంతా లాక్డౌన్లో మగ్గింది. ఈ సందర్భంగా లక్షలాది మంది ఉపాధి పోగొట్టుకుని రోడ్డున పడ్డారు. అందువల్లే కరోనా సెకెండ్ వేవ్ ఉధృతంగా కొనసాగినప్పటికీ ప్రభుత్వాలు లాక్డౌన్ ఊసే ఎత్తలేదు. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ, కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని పాలకులు తేల్చి చెప్పారు.
కరోనా ఫస్ట్ వేవ్‌లో ఏడాది పాటు లాక్డౌన్ పెట్టడం వల్ల ప్రభుత్వాలు, పారిశ్రామిక సంస్థలు, వ్యక్తులు, కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ నష్టం నుంచి బయటపడేందుకు చాలా సమయం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే సెకెండ్ వేవ్‌లో లాక్డౌన్ విధించాలనే ప్రతిపక్షాల రాజకీయ డిమాండ్‌ను ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించు కోలేదు.
తాజాగా మరోసారి లాక్డౌన్ అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం తెరపైకి తెచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం పట్టి పీడుస్తుండడంతో సుప్రీంకోర్టు సీరియస్‌గా స్పందించింది.
శీతకాలంలో ఢిల్లీలో నెలకొన్న కాలుష్య పరిస్థితులపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఎంత దిగజారిందో మీరే చూడంటూ కేంద్రాన్ని ఉద్దేశించి అన్నారు. ఇళ్లల్లో కూడా మాస్కులు ధరిస్తున్నాం అని ఎన్వీ రమణ అన్నారు.
ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణా, యూపీల్లో ఏటా పంట చేతికొచ్చిన తర్వాత రైతులు మిగిలిన వ్యర్థాలను పొలాల్లోనే కాల్చుతుంటారు. దీని ఫలితంగా ఢిల్లీ వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటుందని, వాటిని కాల్చకుండా చర్యలు తీసుకుంటున్నట్టు కోర్టుకు కేంద్ర ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
కేంద్ర ప్రభుత్వ సమాధానంపై సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. ‘రైతుల వల్లే కాలుష్యం జరుగుతుందని ఎందుకు ఒక నిర్ణయానికి వచ్చారు? ఈ కాలుష్యానికి అది ఒక కారణం మాత్రమే. మిగిలిన వాటి గురించి ఏం చెప్తారు? కాలుష్య నియంత్రణకు ఏం చేస్తు న్నారు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా కానివ్వండి.. మీ ప్రణాళిక ఏంటో మాకు వెంటనే తెలియజేయండి. రెండు రోజుల లాక్డౌన్ ఏమైనా విధిస్తారా?’ అంటూ కేంద్రంపై ప్రశ్నల వర్షం కురిపించడం చర్చకు దారి తీసింది.
సుప్రీంకోర్టు సూచనల మేరకు గాలి కాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్రంతో పాటు ఢిల్లీ చుట్టూ ఉన్న రాష్ట్రాలు లాక్డౌన్ విధిస్తాయా? అనేది చర్చనీయాంశమైంది. కానీ కాలుష్యాన్ని మాత్రం తగ్గించాల్సిన అవసరం ఉంది.