'పరువు పోయింది' అంటూ ఈ రోజు వార్తా కథనాలు వండి వార్చారు. నిత్యం చేస్తున్న పని ఇదే. ఆంధ్ర ఆర్థిక స్థితి పై ఏదో ఒక కథనం. తప్పులేదు. వాస్తవ స్థితిని జనాలకు చెప్పడమే మీడియా పని. కానీ అది వాస్తవంగా చెప్పాలి. అంతే తప్ప, తమకు అనుకూలంగా మార్చుకుని వార్తలు వండి వార్చడం కాదు.
ఇంతకీ విషయం ఏమిటంటే, వైద్య పరికరాలు తయారుచేసి, సరఫరా చేసే సంస్థలకు చెందిన జాతీయ స్థాయి సంఘం తమ సభ్యులను హెచ్చరించింది. ఏమని? ఆంధ్ర ప్రభుత్వానికి ఏమైనా పరికరాలు సరఫరా చేయాలంటే నూరు శాతం అడ్వాన్స్ తీసుకోండి. లేదూ అంటే మీ స్వంత బాధ్యత మీద సరఫరా చేసుకోండి అని.
ఇదిగో చూసారా? ఆంధ్ర పరువు దేశ వ్యాప్తంగా పోయింది అంటూ గగ్గోలు పెట్టేస్తూ, 'పరువు పోయింది' అని తాటికాయలంత అక్షరాలు ముద్రించారు. నిజమే. కానీ సదరు సంస్థ తన వెబ్ సైట్ లో వుంచిన రెడ్ కార్నర్ నోటీసులో ఏముందో అన్నది ఉద్దేశపూర్వకంగా దాచారు. ఏముందో చూద్దాం.
''..apmsidc and their payments are on hold since last 4-5 years..''
ఇదీ ఆ నోటీసు లో వున్న అసలు లైన్. జగన్ ప్రభుత్వం వచ్చి ఎన్ని ఏళ్లు అయింది. రెండున్నరేళ్లు కావస్తోంది. బకాయిలు ఎప్పటి నుంచి పేరుకుంటున్నాయి. నాలుగైదేళ్ల నుంచి అంటే అప్పుడు వున్న ప్రభుత్వం ఎవరిది? ఎందుకు మరి పే చేయలేదు?
ఆ విషయం వార్తలో ప్రస్తావించారా? వార్త మొత్తం మీద నాలుగైదేళ్లు అన్న పదం లేదు. గత ప్రభుత్వ ప్రస్తావన లేదు. దీన్ని బట్టి ప్రభుత్వాన్ని తమ వార్తలతో ఎంత త్వరగా, ఎంత బలంగా బదనామ్ చేయాలో అన్న తహ తహ తప్ప మరోటి కనిపించడం లేదు.