తమ దేశంలో కరోనా ఐదో వేవ్ సాగుతోందని ప్రకటించారు ఫ్రాన్స్ వైద్య శాఖా మంత్రి. గత ఏడాది నవంబర్ సమయంలో కరోనాతో అతలాకుతలం అయిన దేశాల్లో ఒకటి ఫ్రాన్స్. ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆ దేశం కోవిడ్ ను ఎదుర్కొనడంలో ప్రగతి సాధిస్తూ వస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం అక్కడ రోజువారీగా పదివేలకు కాస్త పై స్థాయిలో కోవిడ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ వారంలోనే అక్కడ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. ఈ నేపథ్యంలో దీన్ని తాము ఐదో వేవ్ గా భావిస్తున్నట్టుగా ఫ్రాన్స్ మంత్రి ప్రకటించారు.
యూరప్ లోని ఇతర దేశాల్లో కూడా కరోనా ఐదో వేవ్ సాగుతుండవచ్చని తమ అంచనాలను ఫ్రాన్స్ వ్యక్తీకరించడం గమనార్హం. ఫ్రాన్స్ లో తొలి వేవ్ లో భారీ స్థాయిలో కేసులు రాలేదు. అయితే పరిమిత స్థాయిలోనే కేసులు వచ్చినా కరోనా అక్కడ భయపెట్టింది. ఆ తర్వాత గత ఏడాది నవంబర్ సమయంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. రోజుకు యాభై వేల స్థాయిలో అక్కడ కేసులు రావడం పీక్ స్టేజ్. ఆ తర్వాత కేసులు నెమ్మదించాయి.
ఇక ఈ ఏడాది కూడా అక్కడ రెండు సార్లు కరోనా విజృంభించి, మళ్లీ తగ్గుముఖం పట్టింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియాలో కరోనా విజృంభించిన వేళ ఫ్రాన్స్ కూడా ముప్పు తిప్పలు పడింది. ఆ సమయంలో రోజువారీగా యాభై వేల కేసులు నమోదయ్యాయక్కడ. అయితే జూన్ నెల నాటికి రోజువారీ కేసుల సంఖ్య బాగా తగ్గుముఖం పట్టింది. కానీ ఆ ఊరట ఎక్కవ రోజులు దక్కలేదు. మళ్లీ ఆగస్టులో అక్కడ మరో వేవ్ విజృంభించింది. మళ్లీ ఎక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ నాటికి మళ్లీ కేసుల సంఖ్య తగ్గినా.. ఇప్పుడు మళ్లీ కేసుల సంఖ్య లో పెరుగుదల చోటు చేసుకుంటోంది.
ఒక నెల పెరగడం, మరో నెల తగ్గడం, ఆ తర్వాతి నెల మళ్లీ పెరగడం.. ఇలాంటి రీతిలో అక్కడ కరోనా ప్రవర్తన సాగుతూ ఉంది. మరి కొన్ని యూరప్ దేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఈ హెచ్చుతగ్గులను బట్టి.. ఇది ఐదో వేవ్ అని అక్కడి వైద్య వర్గాలు అంచనా వేస్తున్నాయి. మన దేశంలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య నియంత్రణలోనే కనిపిస్తూఉంది. అయితే ఈ వైరస్ ప్రవర్తన అంతుబట్టని రీతిలో ఉండవచ్చని యూరప్ దేశాల పరిస్థితిని గమనిస్తే అనిపించవచ్చు.