ఏపీ శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 14 ఎమ్మెల్సీ పదవులు దక్కనున్న సంగతి తెలిసిందే. వీటిలో మూడు ఏపీ శాసనసభ కోటాలోని ఎమ్మెల్సీ పదవులు కాగా, మిగిలినవి స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ పదవులు. ఒకేసారి 14 ఎమ్మెల్సీ పదవులు లభిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదవుల పంట పండనుంది.
ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు చేతి నిండా పదవులున్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు, టికెట్లు త్యాగం చేసిన వారికి.. జడ్పీ చైర్మన్ పదవులు, ఓడిన వారిలో కొందరికి ఎమ్మెల్సీ హోదాలు, మరో ఇద్దరికి రాజ్యసభ సభ్యత్వాలు. ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో కోరిన వారందరికీ పదవి దక్కుతోంది. ఇప్పుడు కొత్తగా 14 శాసనమండలి సభ్యత్వాల లభ్యత నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో మరింత జోష్ రాబోతోంది.
ప్రస్తుతానికి శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ పదవులు ఎవరికి అనేది ఖరారు అయ్యింది. ఇటీవలే ఎమ్మెల్సీ గా పదవీకాలాన్ని ముగించుకున్న డీసీ గోవిందరెడ్డికి మరో ఛాన్స్ లభించింది. ఇక మిగిలిన రెండు సీట్లకూ ఒక బీసీ, మరో మైనారిటీ అభ్యర్థిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంచుకుంది. శ్రీకాకుళం జిల్లా నుంచి పాలవలస విక్రాంత్, నంద్యాల మార్కెట్ యార్డు చైర్మన్ ఇసాక్ భాషాలకు ఎమ్మెల్సీ అవకాశం లభించింది.
శాసనసభ కోటాలో మూడు ఎమ్మెల్సీ పదవులూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే సొంతం కానున్నాయి. టీడీపీ పోటీ కూడా చేయలేని పరిస్థితుల్లో ఉంది. ఇక స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ పదవులకు కూడా అభ్యర్థిత్వాల పరిశీలన జరుగుతోందని, మరో రెండ్రోజుల్లో ఆ పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.