అంతులేని ప్రేమ.. విపరీతమైన నిర్లక్ష్యం..!

పాతికేళ్ల ప్రస్థానం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ కి పార్టీ అంటే విపరీతమైన ప్రేమ ఉంది. ఎప్పటికైనా జనసేనను ఏపీలో అధికార పార్టీగా మార్చాలని, అది కుదరకపోతే కనీసం ప్రధాన ప్రతిపక్షంగా మారాలనేది…

పాతికేళ్ల ప్రస్థానం అంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ కి పార్టీ అంటే విపరీతమైన ప్రేమ ఉంది. ఎప్పటికైనా జనసేనను ఏపీలో అధికార పార్టీగా మార్చాలని, అది కుదరకపోతే కనీసం ప్రధాన ప్రతిపక్షంగా మారాలనేది ఆయన తాపత్రయం. కానీ అదే సమయంలో పవన్ కల్యాణ్ కి పార్టీపై విపరీతమైన నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.

కమిటీలతో సరిపెడతారా.. ఎన్నికల బరిలో దిగరా..?

2014 ఎన్నికల్లో పొత్తుల కారణంగా జనసేన బరిలో దిగలేదు. 2019లో ఆ అవకాశం వచ్చినా పూర్తిగా సద్వినియోగం చేసుకోలేదు. ఒకే ఒక్క సీటు గెలిచినా అది కూడా నిలుపుకోలేదు. ఆ తర్వాతయినా కనీసం జాగ్రత్తపడతారనుకుంటే హడావిడిగా బీజేపీతో చేతులు కలిపి మళ్లీ త్యాగాల బాట పట్టారు. 

తిరుపతిలో సీటు త్యాగం చేశారు, బద్వేల్ లో ఏకంగా పోటీయే త్యాగం చేశారు. తీరా ఇప్పుడు మిగిలిపోయిన చోట్ల స్థానిక ఎన్నికలు జరుగుతుంటే పవన్ కల్యాణ్ పట్టీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. పార్టీకి గ్రామ స్థాయి వార్డు స్థాయి కమిటీలు వేయడంపై పెట్టిన శ్రద్ధ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఎన్నికలపై ఎందుకు పెట్టడంలేదనేదే పవన్ కల్యాణ్ పై పడుతున్న అసలు ప్రశ్న.

ఎలక్షన్ పెద్దదా చిన్నదా అనేది ఇక్కడ సమస్య కాదు. చంద్రబాబు లాంటి నాయకుడే కుప్పం మున్సిపాల్టీ కోసం పనిగట్టుకుని రెండుసార్లు పర్యటనకు వెళ్లొచ్చారు. మాజీ మంత్రుల్ని అక్కడ దింపి పార్టీ పరువు కోసం పోరాడుతున్నారు. నెల్లూరులో ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడే మకాం పెట్టారు. కార్పొరేషన్ ఫైట్ లో అభ్యర్థులు చేజారిపోతున్నా హడావిడి మాత్రం ఆపలేదు. మరి పవన్ కల్యాణ్ కి ఏమైంది.

నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో పవన్ ప్రచారానికి రావొచ్చు కదా. మరీ కార్పొరేటర్ల తరపున తాను ప్రచారం చేయాలా అని పవన్ ఆలోచించొచ్చు.. కానీ పాతికేళ్ల ప్రస్థానం అంటే చిన్నగానే మొదలవుతుంది. వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు.. వీరే ఇప్పుడు కీలకం. ఒక్క ఎంపీనైనా ఇచ్చారా, ఒక్క ఎమ్మెల్యేని ఇస్తారా అంటూ పదే పదే ప్రజల్ని దెప్పిపొడిచే పవన్ కల్యాణ్.. ఓట్ల సమయంలో ఎందుకు నీరసించి పోతారు, ఆ తర్వాత ఎందుకు లాజిక్ లు వెదుకుతారు..? ఇలాంటి స్థానిక ఎన్నికల నుంచి మొదలుపెట్టినప్పుడే కదా పార్టీకి పునాది స్ట్రాంగ్ గా పడేది.

పవన్ కల్యాణ్ రాకపోతే కనీసం తన ఆత్మ నాదెండ్ల మనోహర్ ని అయినా ఎన్నికలు జరిగే ప్రాంతాలకు పంపించొచ్చు కదా. పోనీ చంద్రబాబు లాగా ఎన్నికల విషయంలో కనీసం స్టేట్ మెంట్లు ఇచ్చయినా సరిపెట్టొచ్చు కదా.  విశాఖ వెళ్లడానికి, మీటింగ్ పెట్టడానికి తీరిక ఉన్న పవన్ కి, స్థానిక ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో అభ్యర్థులకు కాస్త ధైర్యం చెప్పి, వాళ్లకు అండగా ఉన్నామనే సందేశం ఇవ్వడానికి సమయం దొరకలేదా..? ఇలాగైతే పార్టీని నడపడం ఎలా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.