ఎన్నికల ప్రక్రియ ఒక్కసారి ప్రారంభమయ్యాక…తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. మున్సిపల్ ఎన్నికల్లో పలువురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంపై హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ దొనడి రమేశ్ విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరస్కరణకు గురైన నామినేషన్లపై తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. ఎన్నికపై అభ్యంతరం వుంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవడం మాత్రమే ప్రత్యామ్నాయమని గతంలో ఇదే హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని జస్టిస్ రమేశ్ గుర్తు చేయడం గమనార్హం.
ఆల్రెడీ ఎన్నికల ప్రాసెస్ మొదలైన తర్వాత అందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దీంతో తమ నామినేషన్లను పరిగణలోకి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లను కోర్టు కొట్టి వేసింది.
సరైన కారణాలు లేకుండా నామినేషన్లు తిరస్కరించారన్న పిటిషనర్ల ఆరోపణలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఆయా రిటర్నింగ్ అధికారులను ధర్మాసనం ఆదేశించింది. విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. దీంతో నామినేషన్లు తిరస్కరణకు గురైన అభ్యర్థులకు హైకోర్టులో షాక్ తగిలినట్టైంది.