అనంతపురం జిల్లాలో పరిటాల, జేసీ కుటుంబాలు ఉప్పు నిప్పు…ఇది నిన్నటి మాట. కానీ నేడు పరిటాల, జేసీ కుటుంబ సభ్యులు పాలునీళ్లలా కలిసిపోయారు.
ఇది అనంతపురం జిల్లా వాసులనే కాకుండా, ఆ రెండు కుటుంబాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న వైరం గురించి తెలిసిన వాళ్లను ఆశ్చర్యపరుస్తోంది. నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటన సందర్భంగా పరిటాల, జేసీ కుటుంబ సభ్యుల ఆలింగన దృశ్యం ఆవిష్కృతమైంది.
అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబం సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌లో కొనసాగింది. పరిటాల రవి తెలుగుదేశంలో క్రియాశీలక నేత. రెండు కుటుంబాల మధ్య రాజకీయంతో పాటు వ్యక్తిగత వైరం కూడా ఉంది. దీనికి సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఆజ్యం పోశాయి.
వైఎస్సార్ పాలనలో పరిటాల రవి హత్యకు గురయ్యారు. ఈ కేసులో వైఎస్ జగన్‌తో పాటు జేసీ దివాకర్‌రెడ్డి పాత్ర కూడా ఉందని అప్పట్లో పరిటాల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పరిటాల రవి హత్యలో జేసీ ప్రమేయం ఉందని మాజీ మంత్రి పరిటాల సునీత అనేకమార్లు బహిరంగంగా ఆరోపణలు కూడా చేశారు.
అయితే రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో రాజకీయ సమీకరణలు మారిపోయాయి. కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన తమ్ముడు ప్రభాకర్‌రెడ్డి చేరారు. అప్పట్లో జేసీ కుటుంబం రాకను పరిటాల సునీత అడ్డుకున్నారు. రాజకీయ అవసరాల రీత్యా జేసీ కుటుంబం రాక ఎంతో అవసరమని చంద్రబాబు నచ్చ చెప్పడంతో పరిటాల సునీత అయిష్టంగానే అంగీకరించారు.
ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నప్పటికీ పెద్దగా మాట్లాడుకున్న సందర్భాలు లేవు. పరిటాల శ్రీరామ్ పెళ్లికి జేసీ కుటుంబానికి ఆహ్వానం లేదు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటనకు ఇవాళ వెళ్లారు. ఈ సందర్భంగా పరిటాల శ్రీరామ్, జేసీ ప్రభాకర్‌రెడ్డి అలింగనం చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది.
లోకేశ్‌కు స్వాగతం పలికేందుకు జిల్లా సరిహద్దుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి, శ్రీరామ్ చేరుకున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరనేందుకు వీరిద్దరి కలయికే నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.