ఎరక్కపోయి ఇచ్చాను..ఇరుక్కుపోయాను అని పాడుకోవాలేమో హీరో నాగశౌర్య తండ్రి శంకర ప్రసాద్. తను తన పేరిట తీసుకున్న ఇంటిని తనకు తెలియకుండానే వేరే వాళ్ల పుట్టిన రోజు పార్టీకి ఇవ్వడంతో ఇప్పుడు అరెస్ట్ వరకు వచ్చింది. కొడుకు శౌర్య పేరు బదనామ్ అయింది.
మంచిరేవుల పేకాట కేసులో శౌర్య తండ్రి పేరిట లీజు అగ్రిమెంట్ వున్న ఇల్లు కీలకంగా వుంది. ఈ ఇంటిని ఆయనకు తెలికుండా శౌర్య బాబాయ్ తన స్నేహితుడు సాగర్ కు పుట్టిన రోజు పార్టీ అంటే ఓకె అన్నాడు. ఆ సాగర్ కాస్తా అతగాడి స్నేహితుడు సుమన్ చౌదరికి ఇచ్చాడు. ఆ మొనగాడు అక్కడ పేకాట దుకాణం తెరిచేసాడు.
దాంతో పోలీసుల రైడింగ్, అరెస్ట్ అన్నీ చకచకా జరిగిపోయాయి. ఎఫ్ఐఆర్ లో శౌర్య తండ్రి శంకర ప్రసాద్ పేరు లేదు. కానీ తరువాత జరిగిన విచారణలో ఆయన పేరిట ఇల్లు లీజు వుందని తేలడంతో అరెస్ట్ జరిగిపోయింది.
కోర్టులో బెయిల్ వచ్చింది. కథ ఇప్పటికి సుఖాంతమే. కానీ శౌర్య పేరు మాత్రం మరోసారి మీడియాలో నెగిటివ్ గా ప్రచారంలోకి వచ్చేసింది.