ఏపీలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఇది భారీ ప్రకటన. ఒక విధంగా సంచనల ప్రకటన. ఇదే మాటను వరసగా రెండు రోజులుగా బీజేపీ పెద్దలు అంటున్నారు. ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు ఇదే మాట అంటే తాజాగా మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అంటున్నారు.
వైసీపీ నేతలూ గుర్తు పెట్టుకోండి. మీ అధికారం కేవలం రెండేళ్ళు మాత్రమే. ఆ తరువాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని విష్ణు మీడియా మీటింగ్ పెట్టి మరీ బిగ్ సౌండ్ చేస్తున్నారు. నిజానికి ఇలా మాట్లాడడం ద్వారా బీజేపీ ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటోంది అన్నది అర్ధం కావడం లేదు కానీ దాని మీద సీరియస్ డిస్కషన్ అయితే ఎక్కడా జరగడం లేదన్నది నిజం.
బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి 21 వేల దాకా ఓట్లు వచ్చాయి. అంతకు ముందు 2019లో కేవం 750 ఓట్లు దాకానే వచ్చాయి. అంటే 30 రెట్లు అధికంగా అక్కడ ఓట్లు తెచ్చుకుంది అన్న మాట. మరి ఎన్ని ముప్పై రేట్లు మూడు వందల రెట్లు అవుతే ఏపీలోని 175 లో మెజారిటీ సీట్లలో బీజేపీకి గెలుపునకు సరిపడా ఓట్లు వస్తాయన్న లెక్క అయితే కమలనాధుల వద్ద ఉందో లేదో తెలియదు. కానీ బద్వేల్ లో పెరిగాం, రేపు ఏపీలో పవర్ మాదే అంటున్నారు.
ఇక న్యాయస్థానం టూ దేవస్థానం అమరావతి రైతుల పాదయాత్రను శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి దాకా చేయమని రాజు గారు సూచిస్తున్నారు. అమరావతి రాజధానికే మా మద్దతు అంటూ చెబుతున్నారు. ఏపీలో వైసీపీ పాలనలో మధ్యం ధరలు పెరిగాయని గోల చేస్తున్న రాజు గారు పెట్రో భారం తగ్గించాల్సింది ఏపీ సర్కారే అంటున్నారు.
మొత్తానికి బీజేపీ నేతల తీరూ జోరూ చూస్తే ముఖ్యమంత్రి కుర్చీ ఎపుడు పట్టేద్దామన్న ఉబలాటం ఆరాటం కనిపిస్తున్నాయని సెటైర్లు పడుతున్నాయి. మరి అధికారంలోకి వచ్చేది మేమే అంటూ బీజేపీ అంటే టీడీపీ తమ్ముళ్ళూ చంద్రబాబు ఈ స్టేట్మెంట్ ని ఎలా డైజెస్ట్ చేస్తుకుంటారో అన్నదే చూడాలంటున్నారు.