నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతర వివాదాల్లో అరెస్టు అయ్యి, ఎన్సీబీ విచారణను ఎదుర్కొంటున్న నటి రియా చక్రబర్తికి ఊరట లభించింది. ఈ కేసుల్లో కొన్నాళ్ల పాటు జైల్లో ఉండి విడుదల అయిన రియాకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ల విషయంలో కూడా ఉపశమనం లభించింది.
రియాను డ్రగ్స్ సంబంధిత వ్యవహారంలో నిందితురాలిగా పేర్కొని.. ఆమె బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసింది ఎన్సీబీ. అయితే తన బ్యాంక్ అకౌంట్లను పది నెలలుగా ఫ్రీజ్ చేశారని, దీని వల్ల తనకు అన్యాయం జరుగుతోందని ఎన్సీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని రియా ఆశ్రయించింది.
తన బ్యాంక్ అకౌంట్లను డీఫ్రీజ్ చేయడంతో పాటు, ఎన్సీబీ స్వాధీనం చేసుకున్న తన స్మార్ట్ ఫోన్, ఐ ప్యాడ్ లను కూడా తిరిగి ఇప్పించాలని కోర్టును రియా కోరింది. ఆమె పిటిషన్ ను న్యాయస్థానం విచారణకు తీసుకోగా.. ఇదంతా వీలు కాదని ఎన్సీబీ వాదించినట్టుగా తెలుస్తోంది.
రియా బ్యాంక్ అకౌంట్లను డీ ఫ్రీజ్ చేయకూడదని, ఇంకా విచారణ జరుగుతోందంటూ ఎన్సీబీ తరఫు న్యాయవాది వాదించారు. అయితే రియా బ్యాంక్ అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఇప్పటికే పది నెలలు గడిచిపోయాయట. ఈ నేపథ్యంలో ఎన్సీబీ వాదనను కోర్టు పట్టించుకోనట్టుగా తెలుస్తోంది.
ఆమె అకౌంట్లను డీఫ్రీజ్ చేయడానికి వీల్లేదని, ఆమె లావాదేవీలపై విచారణలు జరుగుతున్నాయంటూ ఎన్సీబీ వాదించినా, ఆ వాదనను కొట్టి వేస్తూ.. రియా బ్యాంక్ అకౌంట్లను డీఫ్రీజ్ చేస్తూ న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. అలాగే ఆమె ఐ ఫోన్, ఐప్యాడ్ లను కూడా తిరిగి ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
రియా అరెస్టు అయిన సమయంలో రకరకాల రచ్చ జరిగింది. ఆమెకు డ్రగ్స్ లింక్స్ ఉన్నాయనే ప్రచారం గట్టిగా సాగింది. ఆ వ్యవహారం పై మీడియాలో నానా రచ్చ జరిగింది. ఒక సుశాంత్ అభిమానులు రియాపై దుమ్మెత్తి పోశారు.
రియాను ఒక తిరుగుబోతు తరహాలో అభివర్ణించడానికి కానీ, ఆమె పై ఇంకా తీవ్రమైన నిందలు వేయడానికి కూడా కొంతమంది వెనుకాడలేదు. అప్పట్లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణాన్ని గట్టిగా వాడుకున్నారు. ఆ క్రమంలో రియాను రచ్చకీడ్చారు. ఇప్పుడు ఆమెకు న్యాయస్థానాల నుంచి ఊరట లభిస్తున్నట్టుగా ఉంది!