బాబుకి అభ్యర్థుల భయం.. 2024లో ఇదో విచిత్రం!

2024 ఎన్నికలకు చంద్రబాబు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు. ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందునుంచీ ప్లాన్ గీస్తున్నారు. అభ్యర్థులను కాచి వడబోస్తామని, ఇప్పటినుంచే చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం మరోలా ఉంది.  Advertisement టీడీపీకి చాలా నియోజకవర్గాల్లో…

2024 ఎన్నికలకు చంద్రబాబు అస్త్రశస్త్రాలు రెడీ చేసుకుంటున్నారు. ఎన్నికలకు రెండున్నరేళ్ల ముందునుంచీ ప్లాన్ గీస్తున్నారు. అభ్యర్థులను కాచి వడబోస్తామని, ఇప్పటినుంచే చెప్పుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో వాస్తవం మరోలా ఉంది. 

టీడీపీకి చాలా నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి. ఒకవేళ దొరికినా ఎన్నికల సమయానికి జంప్ జిలానీలు అయిపోతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఇప్పటికిప్పుడు టీడీపీ తరపున నియోజకవర్గాల ఇంచార్జిలుగా ఉన్నవారిలో సగానికి సగం మంది వచ్చే ఎన్నికలనాటికి వైసీపీ గూటికి చేరతారనే ప్రచారం సాగుతోంది.

టీడీపీ బీఫారం కి దిక్కే లేదా..?

ఏపీలో మిగిలిపోయిన స్థానాలకు, వాయిదా పడ్డ స్థానాలకు ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో టీడీపీకి అభ్యర్థులు కరవయ్యారు. టీడీపీ బీ-ఫారం తీసుకుని నామినేషన్ వేసినవారు కూడా చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చారు. నామినేషన్ విత్ డ్రా చేసుకోవడమే కాదు, నేరుగా వైసీపీ కండువా కప్పేసుకున్నారు. 

వైసీపీ మంత్రాంగం అనండి, టీడీపీ అభ్యర్థుల ఆశ అనండి.. కారణం ఏదైనా తెలుగుదేశం పార్టీకి అభ్యర్థులు మాత్రం కరవయ్యారు. వైసీపీకి ఏకగ్రీవాలు మిగిలాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయితే ఏమవుతుంది..?

స్థానిక ఎన్నికల్లో పిలిచి టికెట్ ఇస్తామన్నా ఎవరూ ముందుకు రాలేదు, వచ్చినవారు పార్టీ ఫిరాయించారు. ఈ దశలో ఎన్నికలకు ముందే టీడీపీ చేతులెత్తేసింది. దీంతో బాబు దీర్ఘాలోచనలో పడ్డారు. 2024 ఎన్నికల కోసం ఇప్పటినుంచే అభ్యర్థులను ప్రకటించినా.. టీడీపీలో కేడర్ ని పోగు చేసుకుని చివరికి వారు వైసీపీలోకి జంప్ అయితే పరిస్థితి ఏంటని మథనపడుతున్నారు. 

అందుకే ఆచితూచి అభ్యర్థుల విషయంలో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు. గతంలో తాను తీసిన ఫిరాయింపుల గోతిలో ఇప్పుడు తానే పడుతున్నారు.