డెడ్ లైన్ ముగిసింది.. ఇక నువ్వేంటో చూపించు పవన్

అప్పటివరకూ నిద్రపోవడం, అప్పుడే సడన్ గా సమస్య గుర్తొచ్చి పిడికిలి బిగించి రోడ్ షో చేయడం, ఆ తర్వాత యథావిధిగా ఆ సమస్యను మరచిపోవడం పవన్ కి అలవాటే.  Advertisement ప్రత్యేక హోదా నుంచి…

అప్పటివరకూ నిద్రపోవడం, అప్పుడే సడన్ గా సమస్య గుర్తొచ్చి పిడికిలి బిగించి రోడ్ షో చేయడం, ఆ తర్వాత యథావిధిగా ఆ సమస్యను మరచిపోవడం పవన్ కి అలవాటే. 

ప్రత్యేక హోదా నుంచి ఉద్ధానం వరకు.. ఇలాంటి ప్రగల్బాలు చాలానే విన్నాం, చూశాం. కానీ ఆ తర్వాతయినా మనిషి మారాడనుకున్నారు చాలామంది. మంత్రులపై నోరుపారేసుకుని, సవాళ్లు విసిరి.. నానా హడావిడి చేసేసరికి ఎన్నికల వరకు అదే మూడ్ కంటిన్యూ చేస్తారని అనుకున్నారు. అదీ లేదు.

ఆ తర్వాత విశాఖ ఉక్కు కోసం బరిలోకి దిగారు. సాగరతీరంలో మరోసారి పిడికిలి బిగించి వైసీపీకి వారం రోజుల అల్టిమేట్టం ఇచ్చారు. అఖిలపక్షం వేయండి లేకపోతే నా సంగతి చూపిస్తానన్నారు. అక్టోబర్ 31న సవాల్ విసిరారు. వారం అయిపోయింది. పదిరోజులు గడిచాయి. ఇంతకీ పవన్ ఎక్కడ…?

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరక్కుండా ఆపాలనే చిత్తశుద్ధి పవన్ కల్యాణ్ కి ఉంటే.. కచ్చితంగా ఆయన కేంద్రంపై పోరాటం చేసేవారు. కానీ పవన్ ఆ పని చేయకుండా.. రాష్ట్రాన్ని టార్గెట్ చేశారు, జగన్ ని బ్లేమ్ చేయాలనుకున్నారు. కానీ ఫెయిల్ అయ్యారు. 

ఆ తర్వాత వారం రోజుల డెడ్ లైన్ విషయంలో కూడా ఆయన పూర్తిగా విఫలం అయ్యారు. పవన్ మాటలకు, చేతలకు పొంతన లేదనే విషయం ఇక్కడ మరోసారి రుజువైంది.

అసెంబ్లీ తీర్మానం చేసిన వైసీపీ ప్రభుత్వం, అఖిలపక్షం వేయదని పవన్ కి తెలుసు. తెలిసి కూడా ఆయన డెడ్ లైన్ పెట్టడం విశేషం. పోనీ దాని ప్రకారం తన సత్తా చూపించడానికి రెడీ అయ్యారా అంటే అదీ లేదు. తన సవాల్ ని తానే మరచిపోయిన పవన్ మరోసారి సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోయారు. ఈ సుదీర్ఘ నిద్ర ముగిసిపోయి మరోసారి ఏదైనా సమస్య గుర్తుకొస్తే వెంటనే పరిగెత్తుకొస్తారు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో వెర్రి వెంగళప్పలు అవుతున్నది జనసైనికులే. అయన పిడికిలి ఎత్తగానే పూనకంతో ఊగిపోతారు. చివరకు ఆయన చేసేదేమీ లేదని తెలుసుకుని సైలెంట్ అవుతారు. “డెడ్ లైన్ పూర్తయింది పవన్, ఇకకైనా మొద్దునిద్ర వీడండి, చిత్తశుద్ధి ఉంటే కార్యాచరణ ప్రకటించండి” అని జనసైనికులు ఎప్పుడు తిరగబడతారో.. అప్పుడే జనసేన పార్టీకి మంచి రోజులు వచ్చినట్టు.