అధికారుల్ని కించపరచడం, ప్రభుత్వ సిబ్బందిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి పనులు చేయించుకోవడం టీడీపీ నేతలకు బాగా అలవాటు. తాము అధికారంలో ఉండగా ఎంతోమంది అధికారులపై దాడులు జరిగాయి, ఇంకెంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు నాయకులు చెప్పిన పని చేయక ఇబ్బంది పడ్డారు. గత ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బంది అంతా చంద్రబాబు ఓడిపోవాలనే కోరుకున్నారు.
అయితే ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చంద్రబాబు తన బ్లాక్ మెయిలింగ్ వ్యవహారం మానుకోలేదు. వచ్చీ రాగానే పోలీసులను టార్గెట్ చేసుకున్నారు. కానిస్టేబుల్ దగ్గరనుంచి, ఉన్నతాధికారుల వరకు ఎవరినీ వదిలిపెట్టలేదు. తమ నిరసనలను అడ్డుకుంటున్నారనే ఉద్దేశంతో అందరినీ ఒకేగాటన కట్టి విమర్శలపాలయ్యారు. మేం అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తాం అన్న స్థాయిలో అహంకారంతో మాట్లాడారు.
అమరావతి ఆందోళనల్లో కూడా పోలీసుల్నే నిందితులుగా చూశారు టీడీపీ నేతలు. ఆందోళనలు కట్టుతప్పుతున్న పరిస్థితుల్లో శాంతి భద్రతలు కాపాడటానికి పోలీస్ డిపార్ట్ మెంట్ చేసిన ప్రయత్నాల్ని కూడా న్యాయస్థానాలు తప్పుబట్టే స్థాయిలో తప్పుడు ప్రచారం చేశారు. తీరా పోలీసుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అప్పట్లో బాబు కాస్త సర్దుకున్నారు. మేం పోలీసులందరికీ వ్యతిరేకం కాదు, కొంతమందికి మాత్రమే నంటూ కవర్ చేసుకున్నారు.
సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లన్నా చంద్రబాబుకి, టీడీపీ నేతలకు బాగా చులకన. వారిని వైసీపీ కార్యకర్తల లాగా భావిస్తూ విమర్శలు చేస్తుంటుంది పచ్చ బ్యాచ్. దానికి తగిన మూల్యం చెల్లించుకుంటోంది కూడా. తాజాగా హనీ ట్రాప్ పేరుతో ఎల్లో మీడియాలో వచ్చిన ఓ కథనంపై ఐఏఎస్ ఆఫీసర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో ఇద్దరు కలెక్టర్లు హనీ ట్రాప్ లో పడ్డారని పూర్తిగా నిరాధారమైన కథనం రాసింది ఆంధ్రజ్యోతి. కలెక్టర్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా ఇలా తప్పుడు కథనాలతో దాడి చేస్తున్నారంటూ కలెక్టర్లు మండిపడ్డారు. ఈ కథనం విశృంఖల కోణంలో ఉందంటూ రాసిన పత్రికపై పరువు నష్టం దావా వేయాలని కలెక్టర్లు నిర్ణయించారు.
ఈ కథనం వెనక కచ్చితంగా ప్రతిపక్ష కుట్ర ఉందనే విషయం తెలుస్తూనే ఉంది. దీంతో ఇప్పుడు టీడీపీ కూడా ఇరుకున పడ్డట్టయింది. పదే పదే దురుద్దేశాలతో నిందలు వేస్తూ, తప్పుడు కథనాలు రాయిస్తూ వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు టీడీపీ నేతలు. ఇలాంటి ఎల్లో బ్లాక్ మెయిలింగ్ ఎంతోకాలం సాగదు. ఇప్పుడు కలెక్టర్లు బైటపడ్డట్టే.. మిగతా సిబ్బంది కూడా చంద్రబాబుకి హెచ్చరికలు జారీ చేసే రోజు ఎంతో దూరంలో లేదు.