వెబ్ సీరిస్ లకు కావాల్సిన ప్రధాన మెటీరియల్ క్రైమ్. దొంగతనాలు, హింస, క్రైమ్ కు సంబంధించిన వెబ్ సీరిస్ లే ఎక్కువగా పాపులర్ అవుతున్నాయి. ఇంగ్లిష్ వెబ్ సీరిస్ లు అయినా, హిందీ వెబ్ సీరిస్ లు అయినా.. కథాంశాలు మాత్రం క్రైమ్ కు సంబంధించినవే. ఈ క్రైమ్ కు సంబంధించి క్రియేటివిటీని చాటుకుంటూ పలు వెబ్ సీరిస్ లు వచ్చాయి, వస్తున్నాయి.
ఈ క్రమంలో హిందీలో ఒక రియలెస్టిక్ క్రైమ్ కథ వెబ్ సీరిస్ గా రూపొందనుందట. ఇటీవలే పోలిస్ ఎన్ కౌంటర్లో మరణించిన యూపీ గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే జీవిత కథ ఆధారంగా ఒక వెబ్ సీరిస్ రూపకల్పన జరగనుందని సమాచారం.
చాలా కాలం పాటు వికాస్ దుబే గ్యాంగ్ స్టర్ గా కాన్పూర్ ఏరియాలో రాజ్యమేలాడు. ఈ క్రమంలో అతడు పోలీసుల మీదకే తన అనుచరుల చేత కాల్పులు జరిపించేంత స్థాయికి ఎదిగాడు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపాడు. అంతే వేగంగా పోలీసుల చేతిలో హతమయ్యాడు.
ఇలాంటి గ్యాంగ్ స్టర్ ల ఎదుగుదల ఆసక్తిదాయకంగా ఉంటుంది. రాజకీయ నేతల అండదండలతో, పోలీసుల అవసరం మేరకు కూడా వారు ఎదుగుతుంటారని ఇది వరకూ పలు ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో వికాస్ దుబే కథలో వెబ్ సీరిస్ కు కావాల్సినంత స్టఫ్ ఉండనే ఉంటుంది. అందుకే ఇప్పుడు అతడిపై దృష్టి పెట్టారట వెబ్ సీరిస్ మేకర్లు. అలాగే బాలీవుడ్ లో అతడి కథతో సినిమాలు తీసే ఆలోచన కూడా కొంతమందికి ఉందట. వాళ్లు కూడా అందుకు సంబంధించి టైటిళ్లు రిజిస్ట్రేషన్ చేయిస్తున్నట్టుగా భోగట్టా.