సమ్మతికీ, అసమ్మతికీ ఒక్క అక్షరమే తేడా. సంతృప్తికీ, అసంతృప్తికీ కూడా అంతే తేడా. అ అంటే అందలం. అది తీసేస్తేనే ఇబ్బందే. అప్పుడు ‘అ’ వ్యతిరేక పదమవుతుంది. అంతే కాదు. సొంత పార్టీ పర పార్టీలాగా కనిపిస్తుంది. పార్టీ నేత పక్క దేశాధినేతలాగా కనిపిస్తాడు. ఇది మామూలే. కానీ ప్రతీ అసంతృప్తి నేతా పెదవి విప్పడు. ఈ అసంతృప్తికి గుర్తింపు రావాలి. అది కూడా అందలాలు వెయ్యగల వేరే పార్టీ నుంచి. అప్పుడు అసంతృప్తి కట్టలు తెగుతుంది. పొంగుతుంది. బోర విరుచుకుంటుంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ దృశ్యాన్ని కనులారా వీక్షించవచ్చు. ఒకానొక.. లేదా.. ఒకేఒక పార్లమెంటు సభ్యుడు ఎన్నికయిన పార్టీ మీద రోజుకొక్క శాపనార్థం పెడుతున్నారు. ఆయన పేరు కనుమూరు రఘురామ కృష్ణరాజు. నర్సాపురం పార్లమెంటు నియోజక వర్గం నుంచి వైసీపీ పార్టీ తరపున 2019లో ఎన్నికయ్యారు. ఈయనతో పాటు మరో 21 మంది కూడా ఇదే పార్టీ టికెట్టు మీద గెలుపొందారు. (ఉన్నవి 25 లెండి. మూడు తప్ప మొత్తం వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.) ఉన్నట్టుండి రాజుకి పార్టీ నచ్చటం మానేసింది.
మరీ ముఖ్యంగా రాష్ట్రంలో అధికారంలో వుండి పార్టీ చేస్తున్న ప్రతీ పనీ ప్రజావ్యతిరేకంగా అనిపించేసింది. టన్నుల కొద్దీ కోపం వచ్చి పడిపోతోంది. ఎక్కడికక్కడ ఏకి పారెయ్యాలనిపిస్తోంది. అనిపించటమేమిటి? అనేస్తున్నారు కూడా. వేగవేగంగా ఉతికేస్తున్నారు. ఎంతలా అంటున్నారంటే, పక్కనున్న తెలుగుదేశం నేతలేక అనుమానం వస్తోంది: ‘ఇంతకీ మనది ప్రతిపక్షమేనా?’ అని. తమకి రావాల్సిన ఆగ్రహం, తమకన్నా ముందు కృష్ణరాజుకొస్తోంది.
రాజు దేన్నీ వదలటం లేదు. రాజధాని వికేంద్రీకరణ మాత్రమే కాదు. ఇసుక చూస్తే కోపం; ఇంగ్లీషు చూస్తే కోపం; ఇంట్లో పూజ చేసుకోమంటే కోపం. వైసీపీ అధినేతగానే కాదు, ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ప్రతి నిర్ణయం మీదా పట్టరాని కోపం. అలాగని ఆయన్ని పల్లెత్తు మాట అనరు. కానీ తనకు ‘ఇంటర్వ్యూ’ ఇవ్వటం లేదని మాత్రం చెబుతారు. మిగిలిన నేతల్ని అందర్నీ కట్టకట్టి తిట్టేస్తారు. ఇలా అంటూ పోతుంటే, ఆ నేతలు మాత్రం ఊరుకుంటారా? వారు సైతం రాజు ఎత్తిన రాగానికి, ఒక్క మెట్టూ తగ్గకుండా గీతాలాపన మొదలు పెట్టాడు.
పార్టీవ్యతిరేక కలాపాలకి పాల్పడుతున్నాడన్న ఫిర్యాదు పార్టీ దాటి, లోక్సభ సభాపతి వరకూ వెళ్ళిపోయింది.. కాదు, కాదు, వెళ్ళి ఆగింది. విపక్షాల కళ్ళతో చూస్తే రాజు ‘ఒకే ఒక్కడు’. వైసీపీ దృష్టిలోంచి చూస్తే ‘ఏకాకి’. రెంటికీ మధ్యలోంచి చూస్తే ‘ఏక సభ్య సేన’ (వన్ మాన్ ఆర్మీ). ఎందుకిలా? పరికించి చూస్తే, నియోజకవర్గంలో రఘురామ కృష్ణరాజు అంతో, ఇంతో మంచి పేరే వుంది. పలుకుబడీ వుంది. ఇలా చెయ్యడం వల్ల ఏమిటి లాభం? ఉత్తినే హఠాత్తుగా గెలుపొందిన రాజకీయనాయుకుడు, అధికారంలోవున్న సొంత పార్టీ మీద, ఏకబిగిన ఇన్ని డైలాగులు పలకడు. మరి ఎందుకూ? క్షణంలో తేల్చిపారెయ్యాలనుకున్న విశ్లేషకులు, ఊహించిన నిర్ధారణలు చేస్తారు. చేసేశారు కూడా:
‘రాజు గోడ దూకుతున్నాడు. రాజు పార్టీ మారుతున్నాడు’. వాళ్ళ మాట నిజం చెయ్యటం కోసమైనా, రాజు ఇప్పటికిప్పుడు దూకిపెట్టాలి? దూకితే ఎటూ..? ‘తెలుగుదేశం’లోకా? ఈ మాట వినటానికే కష్టంగా వుందంటూ, రాజే మీడియా ముందు చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పోగా, పోగా 175 సభ్యులుండే శాసన సభలో పట్టు మని 20 మంది కూడా లేని చోటకు వెళ్తారా? కాకుంటే.. ఇంకే ముంది బీజేపీలోకి. ఎలా వెళ్తారు? ఒక్కడిగా దూకితే అనర్హత వేటు పడుతుంది. వెంట వెళ్ళటానికి రాజు వెంట ఒక్క బంటూ లేడు. ఇలా నోరు పారేసుకుంటే వైసీపీయే బహిష్కరిస్తుందనా? అలా చేస్తే ‘పాపం రాజుగారు దూకటానికి కష్టపడుతున్నారూ.. అని వైసీపీయే నిచ్చెన తెచ్చి వేసినట్లవుతుంది.’ ఆ పని ఎందుకు చేస్తుందీ?
జాగ్రత్తగా ఆలోచిస్తే, రాజు చేస్తున్నదీ… లేదా చేయిస్తున్నదీ ఇప్పటికిప్పుడు ఒరిగే ప్రయోజనం కోసం కాక పోవచ్చు. వైసీపీతో జగడం సాగాలీ, తెగతెంపులు కాకూడదు. రాజు తీరులో ఈ అంశం స్పష్టమయ్యింది కదా! అంతే కాదు. ‘శివాయంలో శివుణ్ణీ, రామాలయంలో రాముణ్ణీ దర్శనం చేసుకున్నట్లు, డిల్లీ వెళ్ళితే దర్శనం చేసుకునేది బీజేపీ’ నే అని చెప్పిన తర్వాత, తన ‘ఏకపాత్రా’భినయానికి ఎవరు స్క్రిప్టు రాశారో రాజు చెప్పకనే చెప్పారు. అవును. ‘కమల నాథులే’.
కానీ బీజేపీది తక్షణ వ్యూహం కాదు. రాజు వీరంగం వెంటనే ముగిసేది కూడా కాదు. బీజేపీకి ఎప్పటి నుంచో, ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి మాత్రమే కాదు, రాష్ట్రాన్ని చేజిక్కించుకోవాలన్న గాఢ కాంక్ష కూడా వుంది. ప్రయత్నాలు కూడా గట్టిగానే చేసింది. ఊహించినట్లుగా 1999లో ‘కార్గిల్’ యుధ్ధానంతర దేశభక్తి అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్నీ కుదిపింది. కానీ ఏం ప్రయోజనం. పొత్తు వల్ల, దేశభక్తిని చంద్రబాబు ‘తెలుగుదేశ’ భక్తిగా అనువదించుకొని అందలమెక్కగలిగారు.
రాష్ర్ట విభజన తర్వాత ‘మోడీ వేవ్’ కూడా ‘జోడీ’ కట్టిన బాబుకే మేలు చేసింది. కాబట్టే ముందు ‘తెలుగుదేశాని’కి దూరం జరగాలనుకున్నారు. వారు ఆశించినట్లుగానే, 2019 నాటికి ఆ పార్టీ చిక్కి శల్యమయ్యింది. ఆ కారణంగా రాష్ట్రంలో ప్రతిపక్షం వుందంటే వుంది; లేదంటే లేదు. ఇదే అదను. బీజేపీ పాచికలాట మొదలు పెట్టింది. ఈ సారి పొత్తు (వుంటే) ‘జూనియర్ పార్టనర్’గా వుండబోమని ‘కాషాయ’ వ్యూహకర్త ఒకరు బహిరంగంగానే సెలవిచ్చారు. అం రేపు (2024లో) బక్క చిక్కిన తెలుగుదేశం పార్టీతో పెట్టుకున్నా, ప్రధాన పాత్ర బీజేపీదే వుండాలనది బీజేపీ వ్యూహకర్తల ఆంతర్యం.
అలా చెయ్యాలంటే, తెలుగుదేశం బలహీన పడటం, బీజేపీ బలపడటం మాత్రమే సరిపోదు. ఎంత చెడ్డా, తెలుగుదేశానికి పేరొందిన ముఖ్యమంత్రి అభ్యర్థిగా వుంటారు? ఆ పార్టీని రెండో స్థానంలోకి నెట్టి వెయ్యాలంటే, బాబు ను మించే స్థాయికి ఒకరిని రాష్ట్రం నుంచి నెట్టాలి? ఆ ఒక్కరూ వెంటనే పుట్టుకురారు. తయ్యారు చెయ్యాలి. ఒక్కర్నే తయ్యారు చెయ్యాలీ అనుకోవచ్చు. లేదా అయిదారుగురున్ని తయారు చేస్తే అందులో ఒక్కరన్నా ఆ స్థాయికి ఎదుగుతారనీ అనుకోవచ్చు.
కాబట్టి జగన్ సర్కారు బాబను మించి బరితెగించి తిట్టే వాళ్ళ అన్వేషణ బీజేపీ మొదలు పెట్టి వుండవచ్చు. ఆ వేటలో ఎదురెళ్ళి వలలో పడ్డ తొలి చేప రఘురామ కృష్ణ రాజు. బీజేపీకి ఇంకా చేపలు కావాలా? ఈ ఒక్క చేపా చాలనుకుంటుందా? వేచి చూడాల్సిందే…!?
సతీష్ చందర్