బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంపై విచారణ జరుపుతున్న సీబీఐ అధికారులు ఇప్పుడు ముంబై పోలీసులతో సమాచారం తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐతో సహా ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ జరుపుతూ ఉంది.
సుశాంత్ అకౌంట్ నుంచి భారీగా డబ్బులను అతడి ప్రియురాలు రియా, ఆమె కుటుంబీకుల అకౌంట్లకు ట్రాన్స్ ఫర్ అయ్యిందనే ఫిర్యాదు మేరకు ఈడీ రంగంలోకి దిగింది. అయితే ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్టుగా రియా అకౌంట్ కు కానీ, ఆమె కుటుంబీకుల అకౌంట్ కు కానీ డబ్బులు బదిలీ కాలేదని ఈడీ తన ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నట్టుగా సమాచారం.
ఇక ఈ కేసులో రెండో కోణం.. సుశాంత్ ది హత్య అనే ఫిర్యాదు. దీనిపై సీబీఐ విచారణ చేస్తోంది. ఈ క్రమంలో ముంబై పోలీసుల వెర్షన్ ను సీబీఐ కోరినట్టుగా తెలుస్తోంది.
సుశాంత్ మరణించిన రోజు తాము అక్కడకు చేరుకునే సరికి ఉన్న పరిస్థితులు, అతడి కుటుంబీకుల వెర్షన్ అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడనే నిర్ధారణకు వచ్చినట్టుగా ముంబై పోలీసులు సీబీఐ అధికారులకు చెప్పినట్టుగా సమాచారం. సుశాంత్ కుటుంబీకులు కూడా తమ వద్ద ఎలాంటి అనుమానాలనూ వ్యక్తం చేయలేదని, కుట్ర- హత్య అయి ఉండవచ్చనే అభియోగాలను వారు చెప్పలేదని ముంబై పోలీసులు చెప్పారట.
తాము సుశాంత్ సోదరితో మాట్లాడగా.. ఆమె అలాంటి ఫిర్యాదు చేయలేదని, సుశాంత్ మరణించి ఉన్న రూమ్ లో ఉన్న పరిస్థితులను బట్టి అది ఆత్మహత్యాగా తాము నిర్ధారించినట్టుగా ముంబై పోలీసులు చెబుతున్నారట. అలా ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదనే నిర్ధారణకు వచ్చినట్టుగా సీబీఐ కు చెప్పారట.
ఒకవేళ ఈ కేసును తాము తారుమారు చేసే ప్రయత్నాలు చేయాలనుకుంటే బిహార్ పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత తాము కూడా మరో ఎఫ్ఐఆర్ దాఖలు చేసేవాళ్లమంటున్నారట ముంబై పోలీసులు. తమ విచారణలో తేలిన అంశాల ద్వారా తాము ఆ నిర్ధారణకు వచ్చినట్టుగా, తదుపరి ఎవరైనా విచారించినా తాము పూర్తి సహకారం అందిస్తామని ముంబై పోలీసులు చెప్పారట.
ఈ కేసులో విచారణకు అంటూ బిహార్ పోలీసులు ముంబైకి రావడం, వారిని ముంబై లో క్వారెంటైన్లో పెట్టడం పెద్ద వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో ముంబై పోలీసుల విచారణ గురించి సీబీఐ కూడా దృష్టి సారించింది. మరి సీబీఐ ఏం తేలుస్తుందో!