సినిమా నిర్మాణం అంత సులువు కాదు. కోట్లతో వ్యవహారం. అది అందరికీ తెలుసు. అలా అని కోట్లు వున్నా కూడా సినిమా నిర్మాణం సులువు కాదు. అంత సజావుగా సాగిపోదు. నిర్మాత మాట చెల్లుతుంది అని లేదు. ఖర్చు అనుకున్న దగ్గరే ఆగిపోదు. హద్దులు దాటినా ఏమీ చేయలేని పరిస్థితి.
పాతిక కోట్లు సులువుగా మిగులుతుంది అనుకున్న ప్రాజెక్ట్ అయిదు కోట్లు చేతికి తగిలేలా మారిపోయినా ఆశ్చర్యం లేదు. అప్పుడు తత్వం బోధపడుతుంది. మనకు ఈ రంగం సెట్ కాదు అనుకుని వెనక్కు వెళ్తారు లేదా.. పొగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని ఇక్కడే అతుక్కు పోతారు.
టాలీవుడ్ ఇలాంటి పాఠాలు నేర్చుకున్న వారు ఎందరో వున్నారు. రీసెంట్ గా మరో నిర్మాత కూడా నేర్చుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఆయన మంచి వ్యక్తి, సౌండ్ పార్టీ. వేరే సంస్థలో భాగస్వామిగా వుంటూ ఇమడ లేక బయటకు వచ్చారు. అయితే స్వంతంగా సినిమా తీసిన అనుభవం లేదు. అయినా పట్టుదలగా రంగంలోకి దిగి ఓ సినిమా ప్రారంభించారు. చాలా సింపుల్ సినిమా పెద్దగా ఖర్చయిపోదు. మాంచి లాభసాటి బేరం అని అంతా అనుకున్నారు. హీరో అదే అన్నారు. ఆయనా అదే అనుకున్నారు.
కానీ దిగిన తరువాత లోతు తెలిసింది. ఖర్చు ఒక్కటే కాదు. అనేకానేక టెన్షన్లు వుంటాయని అర్థం అయింది. ఓ సారి సినిమా చేతికి ఇచ్చాక డైరక్టర్లు తమ మాట వినరు అని అర్థం అయింది. హీరోలు-దర్శకులు ఎప్పటికీ ఒక్కటిగా వుంటారని క్లారిటీ వచ్చింది. జాగ్రత్త ఏమాత్రం తగ్గినా, ఎక్కడికి అక్కడ ఏదో జరిగి, పైసలు ఎక్కడికో జారిపోతాయని తెలిసివచ్చింది. అంతే కాదు, సినిమా తీయడమే కష్టం అనుకుంటే దాన్ని మార్కెట్ చేయడం పదింతలు కష్టం అని అర్థం అయింది.
దాంతో ఇప్పుడు సినీ వైరాగ్యం అలుముకుంది. విడుదల చేయాల్సిన సినిమా తరువాత చేయాల్సిన ప్రాజెక్టును భాగస్వామికి ఇచ్చేసి, సినిమాలు మానేసి, తన ఇతర వ్యాపారాలు తాను చేసుకుంటే బెటర్ అనే ఆలోచనలు చేస్తున్నారట.
కానీ గమ్మత్తేమిటంటే నిర్మాత మినహా ఆ సినిమాకు సంబంధించిన వారు.. అంతా వట్టిదే.. బోలెడు లాభాలు వచ్చాయి.. ఇవన్నీ కట్టు కథలు. లాభం వచ్చిందని చెప్పాల్సి వస్తుందని ఇలా అంటున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. పాపం, ఆయన బాధ వీళ్లకు కథలా వుంది. సినిమా రంగంలో అంతే.. సినిమా రంగంలో అంతే.