రోడ్డు షోలపై తెచ్చిన జీవో లోకేశ్ పాదయాత్రని అడ్డుకోడానికే అని తెలుగుదేశం నాయకులు విమర్శిస్తున్నారు. ప్రతిదాన్ని రాజకీయం చేయడమే తప్ప వాస్తవ జ్ఞానం లేనివాళ్లు. 11 మంది చావుకి కారణమై సిగ్గుఎగ్గు లేకుండా మాట్లాడ్డం టీడీపీకే చెల్లింది. చేసిన పాపాన్ని కప్పి పుచ్చుకోడానికి మొదట పోలీసుల మీద నింద మోపారు. తర్వాత ఘటనకి వైసీపీ స్లీపర్ సెల్స్ కారణమన్నారు. అంటే తెలుగుదేశం జనాల్ని చూసి, కుట్రతో వైసీపీ వాళ్లు జనంలో చేరిపోయి అల్లర్లు సృష్టించారని కొత్త కథ అల్లారు.
జనం ప్రాణాలు పోకుండా తన వంతు ప్రయత్నాలు చేయడం ప్రభుత్వ విధి. దానికి జీవో తెస్తే వక్రభాష్యాలు. లోకేశ్ అనే సునామీకి జడిసి, జగన్ ఆగమేఘాల మీద జీవో తెచ్చాడనే విధంగా ఉన్నాయి మాటలు. అసలు లోకేశ్‌కు అంత సీన్ వుందా? టీడీపీకి అవసరం కాబట్టి, జనాలు తోలుతారు. అంతే తప్ప లోకేశ్ యాత్రకు జనం స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితి వుందా? గత ప్రభుత్వంలో తండ్రీకొడుకులు కలిసి ఏం అద్భుతాలు చేశారని జనం వస్తారు?
అసలు తెలుగుదేశం పార్టీకి, లోకేశ్‌కి ఏం సంబంధం? ఎన్టీఆర్ పార్టీ పెడితే చంద్రబాబు దొంగలా దూరాడు. అవకాశం కోసం వేచి చూసి వెన్నుపోటు పొడిచాడు. పార్టీ కోసం పగలూరాత్రి పని చేసిన వాళ్లు వేల మంది వుండగా, 83లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన బాబు, దొంగదారిలో ముఖ్యమంత్రి అయ్యాడు.
పార్టీ కోసం ఒక్క రోజు కూడా శ్రమ పడని లోకేశ్ కేవలం వారసుడి హోదాలో ఏకంగా మంత్రి అయ్యాడు. నిజానికి ఆ స్థానంలో వుండాల్సింది జూనియర్ ఎన్టీఆర్. అతడి చరిష్మాని తాత్కాలికంగా వాడుకుని, కరివేపాకులా పక్కన పడేశారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని వాడుకుని వదిలేసి, ఒక్కర్ని కూడా రాజకీయాల్లో ఇమడకుండా కుట్ర చేసి, లోకేశ్‌కి పట్టం కట్టాలని చూస్తే పార్టీతో పాటు, లోకేశ్‌ని కూడా జనం ఓడించారు.
సోనియాగాంధీనే ఎదిరించి , కాంగ్రెస్ నుంచి బయటికొచ్చి సొంత పార్టీ పెట్టుకున్న జగన్‌కి , తాతని మోసం చేసి తండ్రి లాక్కున్న పార్టీలో పదవులు అనుభవించాలని చూస్తున్న లోకేశ్‌కి పోలిక వుందా? లోకేశ్‌కి భయపడి జగన్ జీవో తెస్తాడా?
ఈ జీవో రాకపోతే ప్రచార పిచ్చితో ఎన్నికలు ముగిసేలోగా ఇంకో వంద మందిని చంపేవాళ్లు. వాళ్లదేం పోయింది? చచ్చేదంతా పేదలు. నష్టపరిహాం ఇచ్చి చేతులు దులుపుకుంటారు. జీవో వల్ల వైసీపీ చేసిన కుట్ర ఏమీ లేదు.
ఆడలేక మద్దెల ఓడు అనే సామెత తెలుగుదేశానికి కరెక్ట్‌గా వర్తిస్తుంది.