నటి, ప్రముఖ యాంకర్ అనసూయ సామాజిక సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ వుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా వుంటూ తాను ఫీల్ అయ్యే అంశాలపై నిర్మొహమాటంగా అభిప్రాయాలను వెల్లడిస్తూ వార్తల్లో వ్యక్తిగా అనసూయ నిలవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ఆమె ప్రశ్నలతో ముంచెత్తారు.
‘కేటీఆర్ సర్.. కరోనా కారణంగా మొదట మనం లాక్డౌన్ ఫాలో అయ్యాం. దేశవ్యాప్తంగా కేసులు క్రమంగా తగ్గుతుండటంతో లాక్‌డౌన్‌ని తొలగించారు. దేశంలో వ్యాక్సినేషన్ కూడా వేగంగా సాగుతోంది. కానీ, వ్యాక్సిన్ తీసుకోని చిన్నారుల పరిస్థితి ఏమిటి? స్కూల్లో పిల్లలకు ఏం జరిగినా తమది బాధ్యత కాదని చెబుతూ తల్లిదండ్రులు మొదట ఓ అంగీకారపత్రాన్ని తప్పకుండా అందజేయాలని స్కూల్స్ ఎందుకు ఒత్తిడి తెస్తున్నాయి? చెప్పండి సర్.. ఇదెక్కడి న్యాయం? ఎప్పటిలాగా ఈ విషయాన్ని కూడా మీరు సమీక్షిస్తారని భావిస్తున్నాను’’ అని అనసూయ ట్వీట్ చేశారు.
కరోనా తగ్గుముఖం పట్టడంతో అన్ని వ్యవస్థలు క్రమంగా గాడిన పడుతున్నాయి. అయితే పిల్లలకు వ్యాక్సిన్ వేయకపోవడం, మరోవైపు థర్డ్ వేవ్‌పై రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకుంది. ఆ ఆందోళన అనసూయ ట్వీట్లో ప్రతిబింబించింది.
ఒక తల్లిగా పిల్లల భద్రతపై ఆందోళనను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎలా అర్థం చేసుకుంటారు? ఆయన స్పందన ఏంటి? అనేది చూడాల్సి వుంది.