మూడు రోజుల కిందట అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ను అనౌన్స్ చేసిన భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై అప్పుడే పొలిటికల్ పార్టీల కన్ను పడినట్టుగా ఉంది. ధోనీని రాజకీయాల్లోకి రావాలంటూ బీజేపీ వాళ్లు ఆహ్వానిస్తున్నారు. ఆ పార్టీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఈ మేరకు పోస్టు చేశారు. ఇక బీజేపీ మద్దతుదారులు కూడా ధోనీని రారమ్మంటున్నారు.
ఇటీవలే జార్ఖండ్ లో కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో ధోనీ ద్వారా ఏమైనా లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోందో ఏమో! అయితే ధోనీ ఇప్పుడే రాజకీయాల్లోకి రాకపోవచ్చు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ ధోనీకి బ్రాండ్ వ్యాల్యూ ఉంది. రాజకీయాల్లోకి వెళ్తే దానికి బ్రేక్ పడుతుంది.
అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉండనే ఉంది. ధోనీ ఆ జట్టుతో ఆడుతూ ఉంటే చాలు.. కొన్ని కోట్ల రూపాయలు వచ్చి పడతాయి. కాబట్టి.. అలాంటి సంపాదనను వదులుకుని ఉన్నట్టుండి రాజకీయాల్లోకి రాకపోవచ్చు. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా రెండు మూడేళ్ల తర్వాత క్రికెట్ కెరీర్ కు పూర్తిగా తెరపడిన తర్వాతే కావొచ్చు. అయితే ఎందుకైనా మంచిదన్నట్టుగా కమలం పార్టీ ఇప్పుడే కర్చిఫ్ వేస్తున్నట్టుగా ఉంది.
సెలబ్రిటీలు, క్రికెట్ మాజీలపై బీజేపీ తగని మక్కువ పెంచుకుంటోంది. ఇప్పటికే మాజీ క్రికెటర్లు కొందరికి టికెట్ లు ఇచ్చింది. బెంగాల్ లో సౌరబ్ గంగూలీని తిప్పుకోవాలనే ప్రయత్నంలో కూడా బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మరో మాజీ కెప్టెన్ కోసం కూడా ప్రయత్నాలు ప్రారంభించినట్టుగా కనిపిస్తోంది.