సమాచార లోపం ఎంత ప్రమాదకరమో తాజా ఉదంతమే నిదర్శనం. ప్రాణాలతో ఉన్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు నిషికాంత్ కామంత్ అనారోగ్యంతో కన్ను మూశారని సినీ నటి రేణు సహాని ట్వీట్ చేశారు. ఆ తర్వాత నిజం తెలుసుకుని చెంపలేసుకున్నారు.
అసలేం జరిగిందంటే…కొంత కాలంగా నిషికాంత్ కామత్ కాలేయ వ్యాధితో బాధపడుతున్నాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో సదరు ప్రముఖ దర్శకుడు చనిపోయారంటూ రేణు సహాని ట్వీట్ చేశారు.
రేణు ట్వీట్ కలకలం రేపింది. ఎందుకంటే ఆయన బతికే ఉన్నారు. దీంతో తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పడంతో పాటు నిషికాంత్ ఆరోగ్యంగా ఉండాలంటూ ఆమె కోరుకుంటూ ట్వీట్ చేశారు. 2005లో ‘డోంబివాలీ ఫాస్ట్’ అనే మరాఠీ చిత్రంతో దర్శకుడిగా ప్రస్థానాన్ని మొదలు పెట్టిన నిషికాంత్…ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు.
చేసిన మొదటి చిత్రానికే జాతీయ అవార్డు రావడంతో సినీ వర్గాల దృష్టిని ఆకర్షించారు. ఆయన కేవలం దర్శకుడిగానే కాకుండా జాన్ అబ్రహాం నటించిన ‘రాకీ హ్యాండ్సమ్’ సినిమాలో విలన్‌గా నటించడం విశేషం. ప్రస్తుతం ఆయన మృత్యువుతో పోరాడుతున్నారు. త్వరగా ఆయన కోలుకోవాలని ఆకాంక్షిద్దాం.