బీజేపీ అంటే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్లే ఇపుడు తల వంచి భజన చేస్తున్నారు. కానీ ఒక సిన్సియర్ పోలీస్ అధికారి మాత్రం అప్పట్లోనే చుక్కలు చూపించారు. ఆయనెవరో కాదు, విశాఖ కొత్త పోలీస్ కమిషనర్ గా నియమితుడైన మనీష్ కుమార్ సిన్హా. ఆయన సీబీఐలో పనిచేస్తున్నపుడు బీజేపికి అనుకూలుడుగా ప్రచారంలో ఉన్న నాటి స్పెషల్ డైరెక్టర్ రాకేష్ అస్థానా మీద వచ్చిన అవినీతి కేసుని విచారించిన అధికారిగా సంచలనం స్రుష్టించారు.
ఒక అవినీతి కేసుకు సంబంధించి ఆస్థానా మీద విచారణను చేపట్టిన సిన్హా నాడు కేంద్రంలోని పెద్దలకు తలనొప్పిగా మారారు. అప్పట్లో సీబీఐలో ఇద్దరు సీనియర్ అధికారుల మధ్య గొడవలు దేశం మొత్తానికి గుర్తుండే ఉంటుంది. అప్పటి డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాలను తగ్గించి రాకేష్ ఆస్థానాను స్పెషల్ డైరక్టర్ గా హఠాత్తుగా బీజేపీ సర్కార్ తీసుకురావడం పెద్ద వివాదం అయింది.
సరిగ్గా ఆ సమయంలో రాకేష్ ఆస్థాన కేసుని గట్టిగానే విచారిస్తున్న సిన్హాను నాగపూర్ కి బదిలీ చేయడం ఆయన దాన్ని సుప్రీం కోర్టులో సవాల్ చేయడం జరిగాయి. ఇలా కేంద్రంలోని బలమైన బీజేపీ సర్కార్ కే చిక్కులు తెచ్చిన సిన్హాను జగన్ ఏరికోరి ఏపీకి తీసుకువచ్చారు.
ఆయన్ని ఇంటెలెజెన్స్ చీఫ్ గా నియమించారు. ఇపుడు ఆయన్ని పాలనారాజధాని విశాఖకు కొత్త సీపీగా నియమించారు. అవినీతి అంటే అగ్గిలా విరుచుకుపడే సిన్హా విశాఖ పోలీస్ ఉన్నతాధికారిగా రావడం రాజకీయంగానూ అతి పెద్ద చర్చగా ఉంది.
విశాఖలో భూ దందాలు ఎక్కువవుతున్నాయన్న నేపధ్యంలో భూ దందాలను, వైట్ కాలర్ నేరాలను ముందే కనిపెట్టి కబ్జా కోరులకు సింహ స్వపంగా ఉంటారన్న పేరున్న సిన్హా నియామకమే ఓ పెద్ద హాట్ టాపిక్. ఆయన్ని విశాఖకు తీసుకురావడం అంటే జగన్ ఆలోచనలు ఏంటో తెలిసిందే. ప్రశాంత విశాఖ కోసమే ఆయన సిన్హాను కొత్త కొత్వాల్ గా పంపారని అంటున్నారు. విశాఖ సీపీగా బాధ్యతలు స్వీకరించిన సిన్హా తాను శాంతిభద్రతలకు పెద్ద పీట వేస్తానని చెప్పడం ద్వారా అక్రమార్కుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తించారు.