బీఆర్ఎస్ ఎక్కడ పోటీ చేస్తే టీడీపీ అక్కడ పోటీ చేస్తుందా?

టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అంటే భారత్ రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్ ) రూపాంతరం చెందిన విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పోటీ చేయాలని అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు…

టీఆర్ఎస్ జాతీయ పార్టీగా అంటే భారత్ రాష్ట్ర సమితిగా (బీఆర్ఎస్ ) రూపాంతరం చెందిన విషయం అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో పలు రాష్ట్రాల్లో పోటీ చేయాలని అధినేత కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన పార్టీ తెలంగాణకే పరిమితమైన ప్రాంతీయ పార్టీ కాదు. కాబట్టి బీఆర్ఎస్ తెలంగాణా సెంటిమెంటును రగిలించి ఎన్నికల్లో పబ్బం గడుపుకునే అవకాశంలేదు. అది జాతీయ అంశాల గురించి, జాతీయ సమస్యల గురించి మాట్లాడాల్సి ఉంటుంది. ఇక టీడీపీ జాతీయ పార్టీ కాకపోయినా ఆ పార్టీ వారు తమ పార్టీని జాతీయ పార్టీగా చెప్పుకుంటూ ఉంటారు.

కేసీఆర్ బీఆర్ఎస్ పేరుతో ఎక్కడికి వెళితే అక్కడికి టీడీపీ వెళ్ళడానికి సిద్ధంగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేసీఆర్ తన పార్టీలో టీ అనే అక్షరాన్ని తొలగించడం ద్వారా తెలంగాణలో ఏ పార్టీ అయినా స్వేచ్ఛగా రాజకీయం చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో చంద్రబాబు ఖమ్మంలో బహిరంగసభ పెట్టి విజయవంతమయ్యారు. రాజకీయ విశ్లేషకులు కూడా కేసీఆర్ ఎక్కడికి వెళితే అక్కడికి టీడీపీ కూడా వస్తుందని, ఎక్కడైతే బీఆర్ఎస్ పోటీచేస్తుందో అక్కడ టీడీపీ కూడా పోటీ చేయబోతోందని అంచనా వేస్తున్నారు. 

తొలి నుంచి ప్రత్యర్థులుగా కత్తులు నూరుకుంటున్న కేసీఆర్, చంద్రబాబు మధ్య రాష్ట్రం విడిపోయిన తర్వాత విభేదాలు మరింత ముదిరాయి. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జట్టుకట్టి కేసీఆర్ ను ఓడించడానికి చంద్రబాబు ప్రయత్నించారు. గెలుపొందిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ వ్యాఖ్యానించిన కేసీఆర్ 2019 ఏపీ ఎన్నికల్లో జగన్ గెలిచేందుకు సహాయపడ్డారు. ఇప్పుడు ఆంధ్రుల పార్టీ, సెంటిమెంట్, ప్రత్యేక తెలంగాణ అనడానికి అవకాశం లేకుండా కేసీఆరే చేశారు. దీంతో చంద్రబాబు ఎటువంటి ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా రాజకీయం చేసుకోగలుగుతున్నారు.

బీఆర్ఎస్ ఏపీలోను రాజకీయం చేయడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే కార్యాలయ నిర్మాణానికి అవసరమైన పనులను పర్యవేక్షిస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ ద్వారా ఏపీలోకి వస్తుండగా, చంద్రబాబు అదే తెలుగుదేశం పార్టీతో బలోపేతమయ్యేందుకు కృషిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా తెలుగువారు ఏ రాష్ట్రంలో ఎంత సంఖ్యలో ఉన్నారు? అక్కడ ప్రధాన రాజకీయ పార్టీలేవి? తెలుగువారి కోసమని పోటీచేస్తే స్పందన ఎలా ఉంటుంది? స్థానిక పార్టీలతో ఏమైనా పొత్తు పెట్టుకోవాలా? మొదలైన అంశాలపై కేసీఆర్ ఒక అంచనాకు వచ్చారు. 

మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, న్యూ ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో తెలుగువారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడంద్వారా జాతీయ పార్టీకి కావల్సిన హోదాను సంపాదించవచ్చని కేసీఆర్ భావిస్తున్నారు. మరి కేసీఆర్ చేస్తున్న ఈ పనులన్నీ చంద్రబాబు కూడా చేస్తారా? లేక ఆంధ్రాకు, తెలంగాణకే పరిమితమవుతారా?