గత కొన్ని రోజులుగా బెంగళూరు నగర పరిధిలో రోజుకు రెండు వేల స్థాయిలో కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఆ మధ్య వారం రోజుల పాటు అదనపు లాక్ డౌన్ విధించినా పెద్దగా ప్రయోజనాలు కనిపించినట్టుగా లేవు. కేసుల సంఖ్య అక్కడ పెరుగుతూ ఉంది. అయితే రెండు రోజుల కిందట ఉన్నట్టుండి మరిన్ని ఎక్కువ కేసులు నమోదయ్యాయి. అలా ఉన్నట్టుండి స్పైక్ ఎందుకు పెరిగింది? అంటే.. అందుకు సమాధానం ఒక్కటే, అదే రోజు ఎక్కువ పరీక్షలు చేశారట!
ఎక్కువ పరీక్షలు చేసిన రోజు ఎక్కువ కేసులు నమోదు కావడం, ఆ స్థాయిలో పరీక్షలు చేయని రోజున తక్కువ కేసులు నమోదు కావడం.. ఇదీ ఒక పరిశీలన. దీన్ని బట్టి.. దేశంలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉందని, టెస్టులు చేస్తే బయట పడటం లేకపోతే బయటపడకపోవడం అనే పరిస్థితి ఉందని అనుమానించాల్సి వస్తోంది.
చాలా రాష్ట్రాలు టెస్టుల విషయంలో ఇప్పుడిప్పుడు మరింత శ్రద్ద చూపుతూ ఉన్నాయి. మరి కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇప్పటికీ తక్కువ టెస్టులు, తక్కువ కేసులు అనే ఫార్ములాను నమ్ముకున్నట్టుగా ఉన్నాయి! ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఏం మాట్లాడుతున్న పరిస్థితి కనిపించడం లేదు. టెస్టులు ఎక్కువ చేయాలంటూ రాష్ట్రాల మీద కేంద్రం ఒత్తిడి పెద్దగా లేదేమో అనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి.
అదేమంటే రాష్ట్రాలు కూడా కేంద్రం మీద ఎదురుదాడి చేస్తున్న వార్తలు వస్తున్నాయి. కోవిడ్-19 భారం అంతా తమ మీదే పడుతోందని, కేంద్రం ఆదుకోవడం లేదని ఇది వరకే కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు వ్యాఖ్యానించాయి కూడా. ఈ క్రమంలో టెస్టుల విషయంలో దేశమంతా ఒకే స్థితి అనేది కనిపించడం లేదు.
గత 24 గంటల్లో 8.3 లక్షల టెస్టులు చేశారు దేశ వ్యాప్తంగా. దాదాపు 66 వేల కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఒకే రోజు 8 లక్షలకు పైగా టెస్టులు చేయడం దేశంలో ఇదే తొలిసారట. టెస్టింగ్ సామర్థ్యం పెరుగుతోందని.. ఇది మంచిదే అని పరిశీలకులు చెబుతున్నారు. అయితే.. ఈ టెస్టింగ్ లు బాగా జరిగే రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, మిగతా రాష్ట్రాల్లో ఫస్ట్ కాంటాక్ట్, సెకెండరీ కాంటాక్ట్ పర్సన్స్ లకు టెస్టుల ఊసే లేదు! రాష్ట్రాల మధ్యన ప్రయాణాలకు ఎలాంటి అభ్యంతరాలూ ఉండనక్కర్లేదని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇలాంటప్పుడు.. కొన్ని రాష్ట్రాలు టెస్టులు చేస్తున్నా.. పక్క రాష్ట్రాలు శ్రద్ధ చూపకపోవడంతో వాటికి తలనొప్పి తప్పడం లేదు. మహారాష్ట్ర దెబ్బకు కర్ణాటకలో కరోనా వ్యాప్తి పెరగడం అందుకు ఒక ఉదాహరణ!
కరోనా పరీక్షల విషయంలో దేశ వ్యాప్తంగా ఒక నియమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పరిస్తే.. గుట్టంతా బయటపడే అవకాశం ఉంది. అయితే ఐదు నెలలు గడుస్తున్నా కేంద్రం అలాంటి యూనిఫామ్ నియమాన్ని ఏదీ ప్రతిపాదించడం లేదు కూడా!