వైసీపీ, టీడీపీ రాజకీయంగా ప్రధాన ప్రత్యర్థులు. అయితే ఇరు పార్టీలు కూడా కొందరిని శత్రువులుగా చూస్తున్నాయి. సొంత ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అంటే టీడీపీకి అక్కసు. చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై హద్దులు దాటి నోరు పారేసుకుంటున్నారనే ఆగ్రహం టీడీపీ నేతల్లో వుంది. అలాంటి వారితో తమ పార్టీ నాయకుడు వంగవీటి రాధా అంటకాగడంపై చంద్రబాబు, టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అలాగని ఆయన్ను ఏమీ అనలేని నిస్సహాయ స్థితి.
దివంగత వంగవీటి రంగా వర్ధంతి నేడు. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా వర్ధంతిని జరుపుకోడానికి సిద్ధమయ్యారు. మరీ ముఖ్యంగా ఎన్నికల కాలం మొదలు కావడంతో లేని ప్రేమాభిమానాలు పుట్టుకొస్తున్నాయి. చివరికి రంగాను అంతమొందించిన వాళ్లు కూడా ఆయన వర్ధంతి నిర్వహించడానికి ఉత్సాహం ప్రదర్శిస్తుండడాన్ని చూస్తే… ఇదేం రాజకీయం అని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఇవాళ విజయవాడ బెంజ్ సర్కిల్లో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రంగా తనయుడు రాధాతో పాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి తదితరులు హాజరుకానున్నారు. ఆదివారం కూడా ఇదే రీతిలో విజయవాడ సమీపంలోని నున్నలో రంగా విగ్రహావిష్కరణ జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, మోహనరంగా తనయుడు రాధా పాల్గొన్నారు.
ఈ సభలో కొడాలి నాని మాట్లాడుతూ టీడీపీ నేతలే రంగా హత్యకు పాల్పడ్డారని ఘాటు విమర్శలు చేయడం గమనార్హం. 1989లో ఇదే కారణంతో టీడీపీ అధికారాన్ని కోల్పోయింది. రంగా హత్య అనంతరం టీడీపీకి కాపులు పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత నెమ్మదిగా టీడీపీపై కోపం చల్లారుతూ వచ్చింది. రంగా హత్య అనే తేనె తుట్టెను కదిపితే టీడీపీకే నష్టం. అందుకే టీడీపీ భయపడుతోంది. రంగా తనయుడు గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరినప్పటికీ, అంటీముట్టనట్టుగా ఉన్నారు.
పైగా టీడీపీ బద్ధ శత్రువులతో ఆయన సన్నిహితంగా మెలుగుతున్నారు. వంగవీటి రాధా మళ్లీ వైసీపీకి చేరువ అవుతున్నారనే అనుమానం టీడీపీలో వుంది. రాధాతో రాజకీయంగా లాభం లేకపోయినా, తన తండ్రి ఎపిసోడ్‌ను గుర్తు చేస్తే మాత్రం నష్టపోతామని టీడీపీ భయపడుతోంది. అందుకే అతన్ని టీడీపీ ఏమీ అనలేకపోతోంది. రాధా విషయాన్ని కాలానికి వదిలేయడం మంచిదనే భావనలో చంద్రబాబు, లోకేశ్ ఉన్నారు. తండ్రిపై విశేష ప్రజాదరణను తనయుడైన రాధా సొమ్ము చేసుకోలేకపోతున్నారు. స్థిరత్వం లేని నిర్ణయాలతో తెగిన గాలి పటంలా రాధా రాజకీయ ప్రయాణం సాగుతోందన్న విమర్శ లేకపోలేదు.