ఏపీలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిన వైసీపీ.. అధికారంలోకి రాగానే భూ సేకరణ మొదలు పెట్టింది. ప్రభుత్వ భూములతో పాటు, ప్రైవేట్ భూములు కూడా కొనుగోలు చేసి ప్లాట్లు వేసి, వాటిని అభివృద్ధి చేసి మరీ పేదలకు కేటాయించబోతోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది ఉగాది పండక్కి ఇళ్ల పట్టాల పంపిణీ మొదలు కావాల్సింది. అయితే కరోనా వల్ల ఆగిపోయింది.
మార్చి 25నుంచి ఆ కార్యక్రమం ఏప్రిల్ 14కి వాయిదే వేసినట్టు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. అంబేద్కర్ జయంతి రోజున బడుగు బలహీన వర్గాలకు ఇళ్ల పట్టాలు పంచి వారి భవితకు భరోసా ఇస్తామన్నారు. అదీ కుదరలేదు. ఆ తర్వాత మహూర్తం వైఎస్సార్ జయంతి అయిన జులై 8కి మారింది. అప్పుడు కూడా కుదరలేదు. స్థల సేకరణ విషయంలో ప్రతిపక్షం కోర్టుల్లో కొర్రీలు వేయడంతో ఇళ్ల పట్టాల పంపిణీ మొదలు కాలేదు.
ఇక ఆగస్ట్ 15న నిర్ణయించిన తాజా మహూర్తం కూడా ఫెయిలైంది. దీనికి కారణం కూడా కోర్టు కేసులే. కేసులు తెమలకపోవడంతో మరో 2 రోజుల్లో జరగాల్సిన కార్యక్రమం మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. ఈసారి అక్టోబర్ 2న ఇళ్ల పట్టాల పంపిణీ తొలి విడత ప్రారంభమవుతుందని సమాచారం. ఇలా వరుసగా వాయిదా పడుతూ వస్తోంది ప్రతిష్టాత్మక పథకం.
గత ప్రభుత్వాలు కూడా పేదలకు భూ పంపిణీ చేశాయి కానీ ఆ ఇళ్ల స్థలాలు ఎవరికీ పెద్దగా ఉపయోగపడలేదు. వైఎస్సార్ హయాంలో ఇందిరమ్మ కాలనీలు కట్టించారు కానీ ఊరికి దూరంగా ఉండటంతో లబ్ధిదారులకు అవి పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదు. గత టీడీపీ ప్రభుత్వం కేవలం తమ జేబులు నింపుకోడానికే ఎన్టీఆర్ హౌసింగ్ పేరుతో నాసిరకంగా అపార్ట్ మెంట్లు కట్టించింది.
పాదయాత్రలో ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్న జగన్, పేదలకు ముందు నివాస స్థలాలు ఇచ్చి, ఆ తర్వాత అందులో ఇల్లు కట్టుకునేందుకు నేరుగా ఆర్థిక సాయం చేయాలని భావించారు. ఆయన ఆలోచనకు అనుగుణంగానే రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఒకటిన్నర సెంటు, పట్టణాల్లో సెంటు భూమిని ప్రభుత్వం సేకరించింది. ఈ స్థలాల్లో లే అవుట్లు వేసి లాటరీ ద్వారా ప్లాట్లు కూడా కేటాయించారు. ఈ ప్లాట్లు తమ చేతికొస్తే, తమ పాట్లన్నీ తొలగిపోతాయని పేదలు సంతోషంగా ఉన్నారు.
అయితే ఊరించి ఉసూరుమనిపించినట్టు.. నాలుగుసార్లు ఈ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. ప్రతిసారీ కొత్త తేదీ ప్రకటించడం, తీరా మహూర్తం దగ్గరకు వచ్చాక వాయిదా వేశామని చెప్పడం.. ఇదంతా ఎందుకు? పేదలతో ఈ దోబూచులాట ఆడటం దేనికి? అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఓ తేదీ నిర్ణయించి పట్టాలు అందించొచ్చు కదా? ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల కుట్రలను బహిర్గతం చేయడానికే ఇలా వాయిదా పర్వాన్ని ఎంచుకున్నట్టు అర్థమవుతోంది.
ప్రతిసారీ ప్రతిపక్షం కుట్రల్లో భాగంగానే, కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న కారణం వల్లే ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోతోంది. ప్రభుత్వంపై కక్ష ఉండొచ్చు, కనీసం పేదల బతుకుల్లో సంతోషం నింపడానికైనా ప్రతిపక్షం సహకరించొచ్చు కదా?