“మనవాళ్లు వట్టి వెధవాయిలోయ్” అంటాడు కన్యాశుల్కంలోని గురాజాడవారి గిరీశం. ఇప్పుడు తెలుగు సినీ అభిమానులు కూడా అలా అనుకోవాల్సిన సందర్భం వచ్చింది.
హిందీ తర్వాత అత్యధిక చిత్రాలు తీసేది తెలుగు రంగమని, దక్షిణభారతంలో మనల్ని మించిన బాహుబలులు లేరని జబ్బలు చరుచుకోవడంతోటే మనం ఆగిపోతున్నాం. “అదే విజయమనుకుంటే పొరపాటోయి”..అని మాత్రం అనుకోవడంలేదు.
గల్లీ క్రికెట్లో సిక్సు కొట్టి టెండూల్కరులా ఫీలయ్యే బాపతులో ఉన్నాం మనం. క్రికెట్టుతో పోల్చుకుని చెప్పుకోవాలంటే కనీసం రంజీకి కూడా క్వాలిఫై కాలేని సినీరంగం మనది. ఎందుకో చూద్దాం.
94 ఆస్కారు అవార్డుల బరిలోకి దించేందుకు మన దేశం వాళ్లు మనదేశానికి చెందిన సినిమాలని షార్ట్ లిస్ట్ చేసారు.
కలకత్తాలో 15 మంది జూరీ సభ్యుల నేతృత్వంలో 14 సినిమాలు ప్రదర్శింపబడ్డాయి. వాటిల్లోంచి మండేలా (తమిళ్), నాయట్టు (మలయాళం), షేర్ని (హింది), సర్దార్ ఉద్ధం (హిందీ), చెల్లో షో (గుజరాతి) ఎంపికయ్యాయి.
ఒక్క తెలుగు సినిమా కూడా ఈ లిస్టులో లేదు. అదీ విషయం.
తక్కువ ఖర్చుతో కట్టిపారేసే సినిమాలు తీయడం ఎలాగో వీటిల్లో నాయట్టు, మండేలా చూస్తే తెలుస్తుంది. రెండూ నెట్ ఫ్లిక్సులో ఉన్నాయి. ఆ సినిమాల్లో మునుపెన్నడూ చూడని వైవిధ్యమే వాటిని ఎంపికచేయడానికి కారణం.
అయితే ఈ సినిమాల్లో ఎన్ని నేషన్ దాటి ఆస్కార్ ఫైనల్ నామినేషన్ వరకు వెళతాయనేది వేరే విషయం. ప్రస్తుతానికి మన దేశం గుర్తించిన అంతర్జాతీయ స్థాయి సినిమాలుగా ఇవి స్థానం పొందాయి.
2022 మార్చ్ 27న జరిగే 94 వ ఆస్కార్ వేడుకలో స్థానం పొందడానికి పై సినిమాలు మాత్రమే పోటీ పడుతున్నాయిప్పుడు.
ఇప్పటి వరకు మదర్ ఇండియా, సలాం బాంబే, లగాన్ వంటి సినిమాలు ఆస్కార్ ఫైనల్ నామినేషన్ దాకా వెళ్లాయి కానీ చరిత్రలో ఒక్క భారతీయ సినిమా కూడా ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అవార్డు పొందలేదు.
అవార్డులు మా ట్యాలెంటుకి కొలమానం కాదు అని కొందరు చెప్పుకుంటుంటారు. “అందని ద్రాక్ష పులుపు” సామెత గుర్తొచ్చేది వీళ్లని చూసినప్పుడే. ఎంతసేపూ ఊకదంపుడు ఫార్ములా సినిమాలు, థియేటర్లోనే చూడాల్సిన సినిమా మాది, ఓపెనింగ్స్ అదిరిపోయే సినిమా ఇది, బి-సి సెంటర్సులో ఇరగాడేస్తోంది అని చెప్పుకుంటూ ఇంకా 1970-80 ల నాటి భావజాలంతోనే ఉన్నారు మన సినీ కథకులు, దర్శకులు, నిర్మాతలూను. స్టార్స్ కూడా ఈ పద్ధతినే ప్రోత్సహిస్తున్నారు. లేకపోతే వాళ్లకి స్టార్డమ్ములు ఉండవు కదా.
కానీ మలయాళ సినీ రంగం అలా లేదు. అక్షరాస్యత ఎక్కువున్న రాష్ట్రం అవ్వడం వల్లేమో అక్కడి వారి సినిమాలు కూడా విద్యావంతులైన ఆడియన్స్ కోసం తీసినట్టుగా ఉంటాయి. తెలుగులో రీమేక్ అయిన మలయాళ “దృశ్యం” ఒక ఉదాహరణ. ఆ తరహా కథని, కథనాన్ని, లా పాయింట్స్ ని పెట్టి మనవాళ్లు తీసిన సినిమాలున్నాయా?
“నాయట్టు” ఆసక్తికరమైన కథ. పోలీసుల్నుంచి పోలీసులే తప్పించుకుని పారిపోయే విధానం అద్భుతం.
ఇక “మండేలా” నేటి రాజకీయ దుస్థితికి అద్దం పట్టే కథ. ఈ కథలో కథానాయకుడు చేసిన పనిని ఎలక్షన్ల ముందు ప్రజలంతా చేస్తే చాలు ఐదేళ్లల్లో జరగాల్సిన అభివృద్ధి కొన్ని నెలల్లోనే జరిగిపోవడనికి ఆస్కారం ఉందన్న ఆలోచన రేకెత్తించింది. అందుకే ఆస్కారు తలపు తట్టగలిగే అర్హతని సంపాదించింది.
ఈ సినిమాల బడ్జెట్లు కూడా చాలా తక్కువ.
ఆకట్టుకునే సినిమా తీయడానికి కథ, కథనం, నటీనటులు బలంగా ఉండాలి తప్ప గ్రాఫిక్స్, స్టార్స్, పేరున్న టెక్నీషియన్స్ కాదు.
ఇప్పుడు తెలుగు సినిమా అనేది థియేటర్లోనే మగ్గట్లేదు. ఓటీటీల్లో దూసుకుపోతుంది. ఎల్లలు దాటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు చూసేలా చేస్తోంది. కనుక కొత్త పాయింటుతో, అరెస్టింగ్ స్క్రీన్ ప్లే రాసుకుని తీసే ఆలోచన పెట్టుకోవాలి కొత్తతరం కథకులు.
ఈ వ్యాసం మనవాళ్లని కించపరచుకోవడానికి కాదు. కాస్త అహాన్ని గిల్లి చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నమే.
ఏదో ఒకరోజు తెలుగు సినిమా కూడా ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా ఆస్కారులో జెండా ఎగరేసే రోజుని ఏ తెలుగు దర్శకుడన్నా చూపిస్తాడేమో చూద్దాం. ఆ రోజొస్తే..”మనవాళ్లు గట్టి మేథావులోయ్..” అనుకుని గర్వపడదాం.
శ్రీనివాసమూర్తి