ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అండ్ ట్రేండింగ్ న్యూస్ ఏమిటంటే బోసడికే అనే తిట్టు లేదా అభ్యంతరకరమైన పదం. ఇప్పుడు చర్చంతా దాన్ని గురించే. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇప్పుడు నాయకులు అంటే ముఖ్యమంత్రితో సహా మూలాన కూర్చున్న నాయకుడి వరకు బూతులు తిట్టుకోవడం అత్యంత మామూలు విషయం. దాంట్లో ఆశ్చర్యపడాల్సింది ఏమీ లేదు.
ఆవేశం తెచ్చుకోవాల్సిన పని లేదు. బీపీ పెంచుకోవాల్సిన అవసరంలేదు. బూతులు తిట్టుకోవడం కూడా రాజకీయాల్లో భాగమైనప్పుడు, అదొక కల్చర్ గా మారినప్పుడు దాన్ని స్వీకరించాలేగానీ కొట్టుకోవడం ఎందుకు? దాన్ని తప్పు పట్టడం ఎందుకు? ఒక జిల్లాల్లో ఏదో పండుగనాడు కర్రలతో కొట్టుకుంటారు. దాన్ని ఆపాలని పోలీసులు చాలా ప్రయత్నాలు చేశారు. ఇది మా ఆచారం, సంప్రదాయం అన్నారు.
మరో జిల్లాలో ఏదో జాతర సందర్భంగా పచ్చి బూతులు తిట్టుకుంటారు. ఎందుకయ్యా ఇలా తిట్టుకుంటారు అంటే అది ఆచారమట. కాబట్టి రాజకీయ నాయకులు కూడా బూతులు తిట్టుకోవడాన్ని ఒక ఆచారంగా, సంప్రదాయంగా, ఒక పవిత్ర కార్యంగా భావించుకుంటే ఏ గొడవా ఉండదు.
ఒకళ్ళు ఒక బూతు మాట అంటే మరొకళ్ళు రెండు మాటలు అనాలి. ఒకళ్ళను మించి మరొకరు పవర్ ఫుల్ బూతులు తిట్టాలి. అంతేగానీ దాడులు చేసుకుంటే ఉపయోగమేముంది? టీడీపీ నాయకుడు పట్టాభి వ్యాఖ్యలన్నీ ఓ ఎత్తైతే బోసడికే పదం వాడకం ఓ ఎత్తుగా మారిపోయింది. అసలు సీఎం జగన్ చెప్పినట్లుగా వైసీపీ శ్రేణులకు బీపీ రావడానికి ఈ పదం వాడకమే కారణమన్న చర్చ కూడా జరుగుతోంది.
వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా దీనిపై స్పందించారు. బోసడికే పదంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అసలు దీని అర్ధమేంటో తెలుసుకునేందుకు రఘురామ చాలా శ్రమించారని ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. చివరికి గూగుల్ లో వెతగ్గా, వెతగ్గా ఆయనకు దాని అర్ధం తెలిసిందట.
బోసడికే పదం అర్ధం తెలుసుకునేందుకు వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ తీవ్రంగానే ప్రయత్నించారు. తనకు తెలిసిన స్నేహితుల్ని, ఇతరుల్ని అడిగిన తర్వాత అర్ధం దొరక్కపోవడంతో చివరికి ఆయన గూగుల్ తల్లిని ఆశ్రయించారు. గూగుల్ లో ఈ పదానికి ఆర్ధం ఏముందో తెలుసుకునేందుకు అన్ని భాషల్లోనూ వెతికేశారు. ఇలా వెతగ్గా, వెతగ్గా ఆయనకు బోసడికే పదం అర్ధం దొరికేసిందట.
పట్టాభి వాడిన బోసడికే పదాన్ని అందరూ తిట్టుగా భావిస్తున్నారని, కానీ అది తిట్టు కాదని రఘురామ వ్యాఖ్యానించారు. బోసడికే అంటే మీరు బాగున్నారా అని గూగుల్ లో అర్ధం ఉందని రఘురామ చెప్పుకొచ్చారు. గూగుల్ లో దీని అర్ధం స్పష్టంగా ఉందని రఘురామ తెలిపారు.
సంస్కృతంలో బోసడికే అంటే సర్.. మీరు బాగున్నారా అని అర్ధమని రఘురామరాజు తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. కానీ సంస్కృతంలో అలాంటి ఓ పదముందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. కానీ రఘురామ మాత్రం తాను గూగుల్ లో వెతికానని, అది సంస్కృత పదమని విడమర్చి అర్ధాలు చెప్పేస్తున్నారు.
ఇక టీడీపీ అనంతపురం జిల్లా నాయకుడు పయ్యావుల కేశవ్ కూడా బోసడికే పదం తిట్టు కాదని సెలవిచ్చాడు. ఇది గుజరాత్ లో ఒక ఊరి పేరట. ఆ ఊరి పేరే పట్టాభి చెప్పాడట. ఇలా ఇద్దరు నాయకులు బోసడికే పదానికి అద్భుతమైన అర్ధాలు చెప్పారు. వైసీపీ నాయకులు ఓపిక ఉంటే గూగుల్ లో వెతుక్కోవచ్చు, ఇంకా ఓపిక ఉంటే గుజరాత్ వెళ్లి పట్టాభి తిట్టిన తిట్టు పేరుతో ఊరు ఉందో లేదో తెలుసుకోవచ్చు.
ఏది ఏమైనా, కారణాలు ఏవైనా రాజకీయ అరాచకంలో ఏపీ అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. తెలంగాణా రాజకీయ నాయకులు బూతులు తిట్టుకుంటారు గానీ ఇంత భయంకరంగా కొట్టుకోవడం ఎప్పుడూ చూడలేదు.