బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కు లంగ్ క్యాన్సర్ గా నిర్ధారణ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవలే సంజయ్ దత్ ఆసుపత్రిలో చేరారు. ఆయనకు కోవిడ్-19 టెస్టులు కూడా చేశారు. కోవిడ్ నెగిటివ్ గా తేలినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆయన కొంత అనారోగ్యంతో ఇబ్బంది పడినట్టుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆయనకు లంగ్ క్యాన్సర్ గా నిర్ధారణ అయినట్టుగా ఆయన సన్నిహితులు మీడియాకు సమాచారం ఇచ్చారట.
అయితే చికిత్సతో నయం అయ్యే స్థితిలో సంజయ్ దత్ ఆరోగ్యం ఉందని, అందుకే ఆయన అమెరికా వెళ్లి చికిత్స పొందనున్నారని కూడా వారు పేర్కొన్నారట. వీలైనంత త్వరగా అమెరికా వెళ్లి దత్ చికిత్స పొందబోతున్నారని కూడా వారు పేర్కొన్నారు. ఈ విషయంపై దత్ తన సోషల్ మీడియా ఖాతాలో స్పందించారు. తను ప్రస్తుతం చిన్నపాటి అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్టుగా, చికిత్స పొంది మళ్లీ పని మొదలుపెట్టనున్నట్టుగా తన అభిమానులకు తెలియజేశాడు సంజూ.
తన వెల్ విషర్స్ ఆందోళన చెందనక్కర్లేదని దత్ ఆ పోస్టులో పేర్కొన్నాడు. ప్రస్తుతం సంజయ్ దత్ భార్య, పిల్లలు కూడా ఇండియాలో లేరట. వారు దుబాయ్ లో ఉన్నట్టుగా సమాచారం. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాడు ఈ హీరో అని వేరే చెప్పనక్కర్లేదు. ఈ క్రమంలో ఇప్పుడు అనారోగ్య సమస్య తలెత్తినట్టుగా ఉంది. ప్రస్తుతం ఈ హీరో వయసు 61 సంవత్సరాలు. ఈ అనారోగ్య సమస్యను ఎదుర్కొన గల శక్తి, వయసు రెండూ దత్ కు ఉన్నాయి.