తాను కూత కూయనదే లోకం నిద్రలేవదని వెనుకటికి ఓ కోడి అనుకున్నదట. అలా వుంది టీడీపీ నేతల తీరు. సమాజాన్ని చైతన్యపరిచేందుకే 36 గంటల దీక్ష చేపట్టినట్టు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.
రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలపై వైసీపీ దాడిని నిరసిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు 36 గంటల నిరసన చేపట్టారు. గతంలో మోడీ సర్కార్‌పై కూడా ఇదే రీతిలో ధర్మదీక్షలు చేయడాన్ని గుర్తు తెస్తున్నారు.
తాజాగా చంద్రబాబు దీక్షలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ జగన్ ఉన్నప్పుడు నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని నడిరోడ్డుపై కాల్చాలని, అలాగే చీపుర్లతో కొట్టాలని పిలుపు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే మంత్రులు బూతులు మాట్లాడాన్ని ప్రస్తావించారు. వీళ్ల వ్యాఖ్యలతో పోల్చితే తమ నాయకుడు పట్టాభి మాట్లాడిన దాంట్లో తప్పేం ఉందని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైసీపీ నేతలు వాడిన పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు. టీడీపీ నేతల ఆర్థిక మూలాలను దెబ్బకొడుతూ అరాచకం సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. సమాజ చైతన్యం కోసమే 36గంటల దీక్ష చేపట్టినట్టు ఆయన అన్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడానికి, అలాగే 2019లో అధికారం నుంచి దిగిపోవడానికి సమాజ చైతన్యం కారణం కాదా? అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీని మట్టి కరిపించడానికి సమాజ చైతన్యమే కారణమని వారు అంటున్నారు. తాము చేస్తే తప్ప సమాజం చైతన్యవంతం కాదనే భ్రమలో టీడీపీ ఉన్నట్టు అచ్చెన్నాయుడు మాటలు వింటే అర్థమవుతుందన్నారు. సమాజం నిత్యం చైతన్యవంతమవుతూ… సమయం చూసి బుద్ధి చెబుతుందనే వాస్తవాన్ని టీడీపీ నేతలు గ్రహించాల్సి వుంది.
తమను అధికారంలో కొనసాగిస్తే సమాజం తెలివైనదిగా, లేకపోతే అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతున్నభావన చంద్రబాబు మొదలుకుని టీడీపీ నేతలందరిలోనూ ఉంది. దాన్ని తొలగించుకుంటే టీడీపీకే మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.