వినేవాళ్లు వుంటే… చంద్రబాబు ఎన్ని మాయమాటలైనా చెబుతారనే విమర్శ వుంది. బాబు తనకు తానుగా సొంత డబ్బా కొట్టుకోవడం పీక్స్‌కు చేరుతోంది. తాను అధికారంలో ఉన్నప్పుడు చేసిన మంచి పని గురించి చెప్పుకోకుండా, వస్తే బతుకులు మారుస్తానని చెప్పుకోవడం ఎబ్బెట్టుగా వుంది. ఉత్తరాంధ్రలో ఇదేం ఖర్మ కార్యక్రమానికి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాటలు వింటే నవ్వొస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. అధికారం ఇచ్చినప్పుడు సొంతింటిని చక్కదిద్దుకుంటూ, ప్రజానీకాన్ని మరిచిపోయిన సంగతి తెలిసిందే. ఇందుకు ఆయన రాజకీయంగా భారీ మూల్యం చెల్లించుకున్నారు. మళ్లీ ఇప్పుడు అధికారం ప్లీజ్ అని వేడుకుంటున్నారు.
మళ్లీ ప్రజలకకు మాయమాటలు చెప్పేందుకు జనం ముందుకు వెళ్లారు. గతంలో బాబొస్తే… జాబొస్తుందని విస్తృత ప్రచారం చేశారు. బాబు అధికారంలోకి వచ్చారు. జాబ్ మాత్రం ఆయన కుమారుడికి మాత్రమే దక్కింది. బహుశా జనానికి మతి మరుపని బాబు నమ్ముతున్నట్టున్నారు. అందుకే మళ్లీ తనకు అధికారం ఇస్తే అది చేస్తా, ఇది చేస్తా అని నమ్మబలుకుతున్నారు. ఉత్తరాంధ్ర పర్యటనలో చంద్రబాబు ఏమన్నారో తెలుసుకుందాం.
“చదువుకున్నా ఉద్యోగం వస్తుందో, రాదో అని కొందరు విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాపై బాధ్యత వేయండి. నేను అందరి బాగు చూసుకుంటాను”
“టీడీపీ వస్తే ఆర్థిక అసమానతలు తగ్గించి, ధనికులతో సమానంగా పేదలను నిలబెడతాం. సంపద సృష్టించి ఆదాయం పెంచుతాం. అది పేదలకు ఖర్చు చేస్తాం. ప్రజాస్వామ్యంగా వుంటే ప్రజల్లో గౌరవం వుంటుంది. నోరు పారేసుకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు”
2014లో చంద్రబాబును నమ్మి అధికార బాధ్యతల్ని అప్పగించారు. కానీ జనానికి ఒరిగిందేమిటి? బాబు తన కుమారుడు లోకేశ్‌కు మంత్రిత్వ ఉద్యోగం ఇవ్వడం తప్ప, ఏ ఒక్కరికైనా చిన్న నౌకరి దొరికిందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వని దుస్థితి. ఎన్నికలకు మూడు నాలుగు నెలల ముందు తూతూ మంత్రిగా కొందరికి నిరుద్యోగ భృతి అందించడం చూశాం.
ఇక ఆర్థిక స్థితిగతుల గురించి చంద్రబాబు మాటలు విడ్డూరంగా ఉన్నాయి. ఉమ్మడి, విభజిత ఆంధ్రప్రదేశ్‌ను అత్యధిక కాలం పరిపాలించిన ఘనత తనదే అని చంద్రబాబు పదేపదే చెప్పుకుంటున్న సంగతి తెలిసిందే. మరి ఏపీ ప్రజానీకం బతుకుల్లో తీసుకొచ్చిన మార్పు ఏంటి? అసమానతలు తొలగి వుంటే ఇవాళ ఈ దుస్థితి ఎందుకు వస్తుంది?
చంద్రబాబు వస్తే తమ జీవితాలు మారుతాయని జనం అనుకోవాలి. తనకు తానుగా డబ్బా కొట్టుకుంటే ప్రయోజనం వుండదని చంద్రబాబు గ్రహించాలి. చంద్రబాబు 14 ఏళ్ల పాలన చూసిన వారెవరైనా ఆయన ఏవో అద్భుతాలు చేస్తారని అనుకోరు. బాబు పాలన అంటే… నెగెటివ్ అంశాలే కనిపిస్తాయి. నోరు పారేసుకుంటే చరిత్ర హీనులు అవుతారని తనకు తానే హితవు చెప్పుకుంటున్నట్టుగా వుంది.