పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే క్రమంలో ఉపాధ్యాయులు బెత్తం పట్టుకోవడం చూశాం. పిల్లల్ని కొట్టొచ్చా? అనే ప్రశ్నపై వేరే చర్చ. భయమో, భక్తో ఏదో రకంగా పిల్లల్ని ప్రయోజకుల్ని చేయాలని గురువులు, తల్లిదండ్రులు తపిస్తుంటారు. టీడీపీ నేత బుద్దా వెంకన్న కర్ర చేతపట్టి హంగామా చేశారు.
టీడీపీ నేత పట్టాభి దుష్ప్రవర్తన ఏపీలో రాజకీయ మంట రగిల్చింది. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్త బంద్‌కు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ బంద్‌లో భాగంగా బుద్దా వెంకన్న, కార్యకర్తలతో కలిసి కర్రలు చేతపట్టి హడావుడి చేశారు. ఈ ప్రచార పిచ్చే విద్వేషాలకు కారణమవుతోందన్న విమర్శ ఉంది.
కర్రలు పట్టుకుని తాము కూడా దాడులకు రెడీ అనే సంకేతాల్ని ఇచ్చే క్రమంలో బుద్దా వెంకన్న ఎల్లో మీడియా దృష్టిని ఆకర్షించారు. బుద్దాతో పాటు ఆయన అనుచరుల్ని పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు రక్షణ అవసరం లేదని, తమను తాము కాపాడుకుంటామంటూ బుద్దా కర్రలను చూపడం గమనార్హం.
ఈ కర్రేదో నారా లోకేశ్, పట్టాభిలకు బుద్ధి చెప్పడానికి ఉపయోగిస్తే బాగుండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని పట్టాభి నోటికి హద్దూ అదుపూ లేకుండా వాగుతున్నారని, ఏదో ఒక రోజు పార్టీకి పెద్ద సమస్యే అవుతాడని టీడీపీలో అంతర్గత జరుగుతోంది.
చంద్రబాబు, లోకేశ్ దృష్టిలో పడేందుకు పట్టాభి నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారనే ఆవేదన సీరియర్ నేతల్లో ఉంది. పట్టాభిలా మాట్లాడితేనే పార్టీ కోసం బాగా పనిచేసినట్టనే లోకేశ్ డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోందనే అభిప్రాయాలున్నాయి. కావున పార్టీని తిరోగమనం వైపు నడిపిస్తున్న లోకేశ్, పట్టాభిలకు బుద్ధి చెప్పేందుకు బుద్దా వెంకన్న తన చేతిలోని కర్రను ఉపయోగించాలనే హితవు వెల్లువెత్తుతోంది.