జొన్నవిత్తుల ఒక సంస్కారవంతమైన సబ్బు లాంటాయన. ఆర్జీవి ఒక ఆయిల్ బావి లాంటాయన.
ఆయిల్ బావి జిడ్డు వదిలిస్తానని ఒక డిటర్జెంట్ సబ్బు ప్రతిజ్ఞ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది జొన్నవిత్తుల గారి శపథం.
ఆర్జీవిలాగ ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్నాను అనకుండా “రోజు గిల్లే వాడు” అనే సినిమాని ఆయన ఆర్జీవికి సంస్కారం నేర్పి ఉద్ధరించడానికి తీస్తున్నాను అని అంటున్నారు. అది ఏ మాత్రం సాధ్యం కాని పని.
జొన్నవిత్తుల గారిని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. చక్కని తెలుగుతనం, సంస్కృతి, సంప్రదాయం ఆయన వేషభాషల్లో కనిపిస్తాయి. ఆయన పద్యం, పాట, మాట అన్నింటిలోనూ సరస్వతి పలుకుతుంది.
“వోడ్కా మీద ఒట్టు..నేను….” అని రాసి ఆయన కొందర్ని మెప్పించి ఉండవచ్చు గాక. కానీ సంప్రదాయం, సంస్కారం లాంటివి ఇంచుకైనా చూపించడానికి ఇష్టపడని మ్లేచ్ఛుడైన ఆర్జీవికి, అతని అనుచరగణానికి అసలు ఆ పాట తగిలుండదు. ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు దున్నపోతు మీద దూదిపింజె వేసి చాలా గట్టిగా కొట్టామనుకుంటున్నట్టుగా ఉందనిపిస్తోంది జొన్నవిత్తుల గారి తీరు.
నాతో ఒకాయన, “అయ్యో! జొన్నవిత్తుల గారికి ఇదంతా అవసరమా? ఆయనలో పాండిత్యం ఉంది కానీ తెలివి బొత్తిగా లేదు” అన్నారు. అప్పటిదాకా నాకూ ఆ తేడా తట్టలేదు. పరిస్థితి చూస్తుంటే నిజమే అనిపిస్తోంది.
ఎలా చూసినా జొన్నవిత్తులగారిలో ఉన్న సంస్కారం బ్రహ్మరాక్షసుడైన ఆర్జీవీతో యుద్ధానికి పెద్ద అడ్డు.
ఆర్జీవీ అనే వ్యక్తి చట్టబద్ధంగా మాత్రమే బతుకుతాడు. “మోరల్స్ లేవా నీకు?” అనడిగితే “ఉండాలని చట్టం చెప్పలేదు కాబట్టి నాకు లేవు” అనే రకం. రకరకాల గొడవల్లో చట్టబద్ధంగా అతన్ని ఇరికించే ప్రయత్నం చాలా మందే చేసారు. కానీ ఇంతవరకూ కటకటాలు లెక్కపెట్టలేదంటే అతని పనులు ఎంత చట్టబద్ధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
పురాణాల్లో చదివాం…రాక్షసులకి శివుడు వరాలిచ్చేవాడట. ఆ శివుడి స్థానంలో ప్రస్తుతం రాజ్యాంగం ఉంది. రాక్షస ప్రవృత్తి ఎప్పుడూ ఉంది. జొన్నవిత్తులగారిలాంటి ఋషులు, మునులు లబోదిబోమన్నా పురాణకాలంలో కానీ, ఇప్పుడు కానీ దిక్కు లేదు. శివుడు కూడా అప్పట్లో చేతులెత్తేసేవాడు, ఇప్పటి రాజ్యాంగం లాగ. కారణం అప్పుడు వరాలు, ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన “ఫ్రీడం ఆఫ్ ఎక్స్ప్రెషన్” అనే వరం.
ఎప్పుడైనా సరే ఒకడి వరం మరొకడికి శాపంలా మారుతుంది. అది తప్పదు.
జొన్నవిత్తులగారు కూడా ఆ ఫ్రీడం నే వాడుకుంటున్నారు ఇప్పుడు. తప్పులేదు. అయితే ఆయన శక్తి సరిపోదు. ఎంత గీత దాటి విమర్శిస్తూ సినిమా తీసినా, పాట రాసినా అది సరైన ఆయుధం అవ్వదు. ఆయనలోని సంస్కారం ఆర్జీవిని బెదరకొట్టేంత స్థాయిలో రాయించలేదు. అందుకే బాధతో కూడిన నవ్వొస్తోంది.
ఈయనలాగ సినిమా తీయకపోయినా గంగాధర శాస్త్రి అనే భగవద్గీత గాయకుడు కూడా ఆర్జీవిని “వాడెవడో డైరెక్టరు అరణ్యంలోంచి వచ్చిన జంతువులాగ నాయిష్టం అంటూ మాట్లాడతాడు….” అంటూ ద్వేషభావాన్ని వ్యక్తపరిచారు. ఆయన ముందూ వెనుకా భగవద్గీత గురించి ఎంతో మాట్లాడారు ఆ హెచ్.ఎం.టి.వి ఇంటర్వ్యూలో. చాలా గొప్ప విషయాలు చెప్పారు. కానీ ఈ ఒక్క బిట్టుని కట్ చేసి ఎవరో ఏదో వాట్సాప్ గ్రూపులో పంపారు. అంటే చూడండి…జనానికి శాస్త్రిగారు చెప్పిన భగవద్గీత అక్కర్లేదు..ఆయన ఎవర్నో తిట్టింది, వెక్కిరించింది కావాలి. ఆర్జీవీకి నెగటివ్ ప్రచారమైనా సరే చాలా ఇష్టం. నలుగురూ తనని తిట్టుకోవడం కూడా ఇష్టం. అలాంటి వాడిని తిట్టి అతనికి కావాల్సింది ఇచ్చి “బాగా బుద్ధి చెప్పాం” అనుకోవడం ఎంత బుద్ధిలేని పని?!
ఆర్జీవీ పవన్ కళ్యాణ్ ని వెక్కిరించి తీసిన “పవర్ స్టార్” వార్తల్లోకెక్కింది. కానీ ఆర్జీవిని వెక్కిరిస్తూ తీసిన “పరాన్నజీవి” తేలిపోయింది. ఎందుకంటే ఆ సినిమాకి ఆర్జీవిని పొడిచే పదును లేదు. ఇప్పుడు “రోజూ గిల్లే వాడు”లో కూడ ఏ పదునూ కనిపించట్లేదు. అందుకే జొన్నవిత్తులగారి ప్రయత్నం కూడా వృధాప్రయాస అనిపిస్తోంది నాకు.
ఈ రోజు ఇంకొక పాట విడుదల చేసారు. “దెయ్యంతోనే అన్నీ చెయ్యాలంకుంటాడు…” అంటూ మొదలైంది అది. అది విని ఆర్జీవీ ఎలా ఫీలవుతాడో ఊహించుకుంటే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లాగ అనుకుంటాడు అనిపించింది. అన్నీ తనకి ఇష్టమైన ఎక్స్ప్రెషన్సే అవుతాయనిపించింది. ఇంకెందుకు యుద్ధం ప్రకటించడం అలాంటప్పడు? పైగా అందులో “బికినీ వేసిన భూతాలతో బిజినెస్ చేస్తాడు” అని ఉంది. అంటే ఊర్మిళ, అంత్రామాలి దగ్గర్నుంచి ఆయన సినిమాల్లో పని చేస్తున్న నేటి అప్సర రాణి వరకు భూతాలనా ఆయన ఉద్దేశం? ఏమో మరి..ఎవర్ని తిట్టాలనుకుని ఇంకవెర్ని తిడుతున్నారో అర్థం కావట్లేదు.
ఇప్పుడు ఎ.టి.టి పేరుతో ఆర్జీవి తీస్తున్న కొన్ని దరిద్రాలు వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేవు కానీ అతని ఇంటర్వ్యూలు చాలా వినోదాత్మకంగా ఉంటాయి. ఎక్కడా సోది లేకుండా పాయింట్ మాట్లాడతాడు. కొందరు అనుకుంటున్నట్టుగా నాకు అతను క్రిమినల్ లాగ అనిపించడు. అతని ప్రవృత్తి అది. అతని సినిమాలు చూసి ప్రభావితం అయిపోయేటంత దిక్కుమాలిన పరిస్థితిలో సమాజం లేదు.
“ఊరుకున్నంత ఉత్తమం లేదు” అంటారు. కొందరి విషయంలో అది నిజంగా నిజం. ఆర్జీవీ విషయంలో మరీను.
నాకు నచ్చవు కాబట్టి “దరిద్రాలు” అన్నాను. అందరికీ అవి దరిద్రాలు అవ్వాలని కాదు. నేను మా కుటుంబ సభ్యులతో హోటల్ కి వెళ్తాను. మేము వెజిటేరియన్స్. ఆ హోటల్లో నాన్-వెజ్ కూడా సర్వ్ చేస్తారు. ఆ హోటల్లో మాకు నచ్చిన వెజ్ డిషస్ ఆర్డర్ ఇచ్చుకుని తింటాం తప్ప నాన్-వెజ్ వండుతున్నందుకు ఆ హోటల్ ని కానీ, అవి తింటున్న ఇతర కష్టమర్సుని కానీ తిట్టి.. నాన్-వెజ్ వల్ల ఆరోగ్యం ఎందుకు పాడవుతుందో మాకు నచ్చినట్టు క్లాసులు పీకం.
నేను ఒకటి నమ్ముతాను. మనకి నచ్చినవే అందరికీ నచ్చవు. మనకి నచ్చినట్టు లోకమంతా ఉండదు. లోకంలో మనకి నచ్చినవి తీసుకోవాలి. నచ్చనివి వదిలెయ్యాలి. అంతేగానీ మనకి నచ్చినట్టుగా ఎదుటి వాళ్లని మార్చాలనుకోవడం తెలివి లేని పని.
జొన్నవిత్తులగారిమీద గౌరవ భావంతోనూ, ఆర్జీవి మీద భావరహితంగానూ నా మనసుకు అనిపించింది చెప్పాను.
శైలజ మంత్రిప్రగడ, మిన్నెసోటా- యు,ఎస్.ఏ.