రాజస్తాన్ కాంగ్రెస్ తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రాజీ దారి పట్టారా? వ్యూహం లేకుండా తిరుగుబాటు చేశాడని అనిపించుకున్న పైలట్ ఇప్పుడు రాహుల్ గాంధీతో, ప్రియాంక వాద్రాతో చర్చల్లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ వర్గాలు కూడా సూఛాయగా ధ్రువీకరిస్తూ ఉన్నాయి. తిరిగి కాంగ్రెస్ తో కలిసిపోవడానికి సచిన్ దాదాపు అంగీకరించాడనే టాక్ కూడా వినిపిస్తూ ఉండటం గమనార్హం.
ఇప్పటికే తిరుగుబాటుకు గానూ.. సచిన్ ను ఉపముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో పాటు, రాజస్తానీ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తప్పించింది. మరోవైపు సచిన్ తో పాటు కొందరు తిరుగుబాటు ఎమ్మెల్యేలు పోగా.. మిగిలిన వారితో బలనిరూపణకు కూడా కాంగ్రెస్ పార్టీ రెడీ అంటోంది. సీఎం అశోక్ గెహ్లాట్ పదే పదే బలనిరూపణకు అసెంబ్లీని సమావేశ పర్చడానికి రెడీ అని ప్రకటించినా, గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో సభ సమావేశం జరగని పరిస్థితులు కూడా తలెత్తాయి. ఈ నేపథ్యంలో బలనిరూపణకు కట్టుబడి ఉన్నట్టుగా గెహ్లాట్ ప్రకటించారు. త్వరలోనే సభాసమావేశం కూడా జరిగే అవకాశాలున్నాయి.
ఈ లోపే సచిన్ కాంగ్రెస్ దారికి వచ్చాడనే టాక్ వినిపిస్తోంది. తను, తన గ్రూప్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తోనే ఉన్నట్టుగా సచిన్ ఇది వరకూ వ్యాఖ్యానించినట్టుగా వార్తలు వచ్చాయి. రాహుల్, ప్రియంకలు సచిన్ తో టచ్ లో ఉన్నారనే టాక్ కూడా మొదటి నుంచి ఉన్నదే. ఈ నేపథ్యంలో తాజాగా వారితో సచిన్ పైలట్ సమావేశం అయ్యారని సమాచారం. మరి ఇంతటితో పైలట్ తిరుగుబాటు అంకం ముగిసినట్టేనా? తిరిగి కాంగ్రెస్ లో కలిస్తే.. పైలట్ కు ఇది వరకటి గౌరవం అయినా దక్కేనా? అనేవి శేషప్రశ్నలు!