టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విషయంలో ఏపీ ప్రభుత్వం మళ్లీ ఆ తప్పు చేస్తుందా? అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. కానీ తమ నాయకుడి పర్యటనను పోలీసులు అడ్డుకోవాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నట్టు వారి ప్రకటనలు తెలియజేస్తున్నాయి. లోకేశ్ పర్యటనను పోలీసుల ద్వారా ప్రభుత్వం అడ్డుకుంటే ఉచిత ప్రచారం లభిస్తుందని టీడీపీ ఆశ.
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఈ నెల 20న టీడీపీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. కార్యాలయాన్ని ప్రారంభించడానికి నారా లోకేశ్ అక్కడికి వెళ్తున్నారు. లోకేశ్ పర్యటనపై ఉత్తరాంధ్ర టీడీపీ ఇన్‌చార్జ్ బుద్దా వెంకన్న మాట్లాడుతూ కీలక వ్యాఖ్య చేశారు. లోకేశ్ పర్యటనను ప్రభుత్వం అడ్డుకునే ప్రయత్నం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపజేస్తామని బుద్దా వెంకన్న హెచ్చరించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గతంలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన సందర్భంలో మృతదేహాన్ని చూసేందుకు వెళ్లిన సందర్భంలో లోకేశ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. అలాగే మరో సందర్భంలో ఇదే రకమైన ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు లోకేశ్‌కు అనుమతి ఇవ్వకపోయినా ఆయన వెళ్లడంతో అరెస్ట్ చేయడంపై టీడీపీ భగ్గుమంది. అప్పట్లో నారా లోకేశ్‌ను జగన్ ప్రభుత్వం లీడర్ చేసిందనే విమర్శలు సొంత పార్టీ నుంచి కూడా వచ్చాయి.
తాజాగా పార్టీ కార్యాలయానికి వెళుతున్న లోకేశ్‌ను అడ్డుకోవాలని బుద్దా వెంకన్న పరోక్షంగా గుర్తు చేస్తున్నట్టుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడానికి వెళుతున్న లోకేశ్‌ను అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని?
ఇదంతా టీడీపీ గేమ్‌ప్లాన్ అని వైసీపీ శ్రేణులు విమర్శిస్తున్నాయి. టీడీపీ నేతలు కోరుకున్నట్టు పోలీసులు వ్యవహరిస్తారా లేక సాఫీగా సాగిపోయేలా చర్యలు తీసుకుంటారా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.