కులం పైకి మాట్లాడితే తప్పు

కులం..ఇప్పుడు చాలా మంది జనాల నరనరానా అదే. చాలా మంది పైకి ఎదగడానికి ఆలంబనగా చేసుకునేది అదే. అధికారం అందుకోవడానికి, అగ్రస్దానం చేరుకోవడానికి అదే. కానీ బయటకు మాత్రం మాట్లాడకూడదు. కులపోళ్లు..కులపోళ్లు చాలా స్మూత్ గా తెరవెనుక కలిసిపోయి…

కులం..ఇప్పుడు చాలా మంది జనాల నరనరానా అదే. చాలా మంది పైకి ఎదగడానికి ఆలంబనగా చేసుకునేది అదే. అధికారం అందుకోవడానికి, అగ్రస్దానం చేరుకోవడానికి అదే. కానీ బయటకు మాత్రం మాట్లాడకూడదు. కులపోళ్లు..కులపోళ్లు చాలా స్మూత్ గా తెరవెనుక కలిసిపోయి వుంటారు. 

కలిసే వ్యవహారాలు చేస్తారు. కలిసే అవకాశాలు పంచుకుంటారు. ఒకదగ్గర మంచి డీల్ ఏదయినా వుందీ అంటే తమ వాళ్లకే దక్కేలా చేస్తారు. ఇాలా అన్నింటా… కానీ బయటకు మాత్రం 'ఛీ ఈ కుల పిచ్చ ఏమిటో' అని పతివ్రతల్లా మాట్లాడతారు. పైగా పొరపాటున ఎవరైనా కులాల గురించి మాట్లాడితే వాళ్లని టార్గెట్ చేస్తారు. 

కోటా శ్రీనివాసరావు ఓపెన్ గా కులం గురించి మాట్లాడారు. కమ్మవారి చేతి అన్నం తిన్నా అనే విశ్వాసం వుంది అనే అర్థం వచ్చేలా మాట్లాడారు. అది కొంతమందికి నప్పకపోయి వుండొచ్చు. కానీ వాస్తవం కూడా అదే కదా? టాలీవుడ్ లో నిర్మాతలు, హీరోలు, ఇంకా..ఇంకా…కొన్ని ఏళ్ల క్రితం వరకు కమ్మవారిదే కదా ఆధిపత్యం. నెల్లూరు, చిత్తూరు వైపు నుంచి రెడ్లు కూడా చెన్నయ్ చేరి నిర్మాతలు అయి వుండొచ్చు. నటులు అయి వుండొచ్చు. కానీ మెజారిటీ, ఆధిపత్యం కమ్మవారిదేగా?

దాసరి నారాయణరావు దర్శకుడిగా మారిన తరువాత, ఆయనకు కూడా కమ్మ సంబంధ బాంధవ్యాలు వున్నా కూడా వీలయినంత వరకు కాపులను ఎంకరేజ్ చేసారు. తీసుకువచ్చారు. అవకాశాలు ఇచ్చారు. ఇండస్ట్రీలో కాపుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి దోహదం చేసారు. 

చిరంజీవితో సాన్నిహిత్యం వున్న ఓ నిర్మాత ఇలా చెప్పారు. 'చిరంజీవి మంచి ఫామ్ లో వున్నపుడు ఎవరో అడిగారు. మన కాపులు చాలా మంది వున్నారు. వారికి కూడా కొన్ని సినిమాలు చేయవచ్చు కదా? అని. దానికి చిరంజీవి భలే సమాధానం ఇచ్చారట. 

మన కమ్మవారిని దూరం చేసుకోకూడదు. వారి ద్వారానే సినిమాలు తీయించుకుంటూ మనం ముందుకు వెళ్లాలి. అదే మన కాపులకే సినిమాలు ఎక్కువ చేస్తే, వాళ్లు మనల్ని పక్కన పెట్టి వేరే హీరోను వెదుక్కుంటారు..' ఇదీ విషయం అని ఆ నిర్మాత చెప్పారు. అలాగే పిల్లలకు రెడ్ల సంబంధం కావాలని ఆయన చాలా ముందుగానే ఆలోచించి పెట్టుకున్నారని ఆ నిర్మాత తెలిపారు. 

అంటే చిరంజీవి ఎంత ముందు చూపుతో వ్యవహరించారో అర్థం అవుతుంది. ఇండస్ట్రీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎల్వీ ప్రసాద్, గుమ్మడి, శోభన్ బాబు, కృష్ణ, …ఇంకా ఆ తరువాత…తరువాత..ఇప్పటికీ… మనకు బాగా పరిచయం అయిన పేర్లు. వీళ్లంతా కమ్మవారు కాదా? ప్రసాద్ ల్యాబ్, ఐనాక్స్, ఆర్టీ మల్టీ ప్లెక్స్, ఆర్ఎఫ్సీ, అన్నపూర్ణ, పద్మాలయా, రామానాయాడు, రామకృష్ణ స్టూడియోస్, ఇవన్నీ ఎవరివి? ఫిలిం నగర్ లో ప్రామినెంట్ గా కనిపించే ఇళ్లు, వాకిళ్లు ఎవరివి?

మిగిలిన అన్ని కమ్యూనిటీ వారు లేకపోలేదు. హరనాధ్ గురించి కథలు కథలు వినిపిస్తాయే? ఉదయ్ కిరణ్ గురించి ఎన్నో వ్యధలు వున్నాయి? ఇండస్ట్రీలో కుల రాజకీయాలు అనాది నుంచి నేటి వరకు..లేవు కాక లేవు అని ఎవ్వరయినా గుండెల మీద చేతులు వేసుకుని చెప్పగలరా? చెప్పలేరు.

కానీ.. బయటకు మాట్లాడకూడదు. అలా మాట్లాడిన వాడికి కుల పిచ్చ. కానీ లోపల లోపల ఎవరి వర్గం వారిది. చాలా సైలంట్ గా ఎవరి వర్గాన్ని వాళ్లు మోస్తారు. ఎవరి వర్గాల వారిని వారు పైకి ఎత్తే ప్రయత్నంలోనే వుంటారు. తమ వర్గం వాడి సినిమా ఫ్లాప్ అయినా సోషల్ మీడియాలో ఇలాంటి కళాఖండం రాలేదు. రాదు అనే లెవెల్ లో భజన సాగిస్తారు. 

ఎవరో వెర్రివాడు, వయసు మీద పడి ఛాదస్తం పెరిగి మాట్లాడితే మాత్రం టార్గెట్ అయిపోతాడు. ఇక్కడ కులపిచ్చ ఆధారంగానే పెరగాలి..పెరుగుతారు..కానీ ఆ కార్డు మాత్రం మెడలో వేసుకుని కనిపించరు.