ఫిలిం నగర్ అన్నది సినిమా జనాల కోసం ప్రభుత్వ సహాయంతో తయారైన సొసైటీ. సినిమాల్లో వున్నవాళ్లు, తీసేవాళ్లు, నటించేవాళ్లు, దర్శకులు ఇలా ఓ ఫ్రొఫైల్ అంటూ తయారైన తరువాత ప్రభుత్వ రేట్లకు స్ధలాలు సంపాదించుకున్నారు.
కానీ ఆ రోజుల్లో ఏం జరిగిందో ఏమో, ఎవరి సత్తా కొద్దీ వారికి స్థలాలు అది కూడా ప్రయిమ్ ఏరియాల్లో వచ్చేసాయి. అవన్నీ అలా వుంచితే ఓ ముచ్చట ఇటీవల బయటకు వచ్చింది,
తెలుగుదేశం నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ ముచ్చట చెప్పుకొచ్చారు. ఆయన రాజకీయాల్లో వుంటే ఏవో ఒకటి రెండు సినిమాల్లో భాగస్వామిగా పెట్టుబడి పెట్టారట.
ఆ మాత్రం దానికే ఆయనకు ఫిలిం నగర్ లో స్థలం ఆఫర్ చేసేసారట. ఆ ఆఫర్ చేసింది ఎవరు..అదే పార్టీకి చెందిన మురళీ మోహన్, రాఘవేంద్రరావు. అబ్బే ఎందుకు అంటే, ఆ ఫరవాలేదు వుంటుంది తీసుకోండి అని చెప్పి మరీ ఇచ్చారట.
కేవలం రెండు సినిమాల్లో భాగస్వామ్యం వుంటే చాలు అన్నమాట ఫిలిం నగర్ సౌసైటీలో ప్రభుత్వం రేట్లకు స్ధలం. పోనీ ఆ స్థలాన్ని ఆయనేమన్నా వుంచుకున్నారా అంటే లేదు. ఇట్టే అమ్మేసుకున్నారు.
పైగా ఆయనకు స్థలం ఇవ్వడాన్ని ఆయన ఎలా చెప్పుకున్నారు అంటే…'నపుంసకుడికి రంభనుఇచ్చినట్లు' అంటూ. అంటే ఆయన అన్ని విధాల అనర్హుడు అని ఆయనకు ఆయనే చెప్పుకున్నట్లు. మరి అలా బలవంతంగా కూడా స్థలాలు తమలో తాము పంపకం చేసేసుకోవడం, ఇలా ముసిముసి నవ్వులతో చెప్పుకోవడం..వారికే చెల్లు.