కేసీఆర్ మంత్రివర్గం రూపం మారుతుందా ?

తెలంగాణలో అప్పుడప్పుడు ఓ వార్తా లేదా సమాచారం చక్కర్లు కొడుతూ ఉంటుంది. అదే మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ. ఇప్పుడు మళ్ళీ ఈ సమాచారం రాజకీయవర్గాల్లో హల్ చల్ చేస్తోంది. నాగార్జున సాగర్ ఎన్నిక, రెండు మునిసిపల్…

తెలంగాణలో అప్పుడప్పుడు ఓ వార్తా లేదా సమాచారం చక్కర్లు కొడుతూ ఉంటుంది. అదే మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ. ఇప్పుడు మళ్ళీ ఈ సమాచారం రాజకీయవర్గాల్లో హల్ చల్ చేస్తోంది. నాగార్జున సాగర్ ఎన్నిక, రెండు మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, మేలో ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాక ఈ ఫలితాలన్నిటిని బేరీజు వేసుకొని, విశ్లేషించుకుని, సామాజిక సమీకరణాలు తూకం వేసుకొని కేసీఆర్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తారని అనుకుంటున్నారు. 

ఈ ప్రభుత్వం గట్టిగా అధికారంలో ఉండేది మరో రెండేళ్లు. అంటే ప్రస్తుత ఏడాది. వచ్చే ఏడాది. 2023 ఎలాగూ ఎన్నికల సంవత్సరమే. ఆ ఏడాదంతా ఎన్నికల గొడవే సరిపోతుంది. కాబట్టి మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేస్తే ఈ ఏడాదే చేస్తారని నాయకులు అంచనా వేస్తున్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర దాటింది. అందుకని మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని అంటున్నారు. ఇదివరకు 2019 సెప్టెంబర్‌లో జరిపిన విస్తరణలో కేసీఆర్ ఆరుగురు మంత్రులను అదనంగా కేబినెట్‌లో చేర్చుకున్నారు. 

ఈసారి విధాన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి (ఈయన్ అసెంబ్లీ, విధాన సభలో ఎక్కడా సభ్యుడిగా లేరు), మాజీ మంత్రి, జడ్జెర్ల ఎమ్మెల్సీ సీ లక్ష్మా రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, హన్మకొండ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేర్లు వినిపిస్తున్నాయి. 

ఇక ప్రధానమైన విషయం ఏమిటంటే … కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితకు మంత్రి పదవి ఇస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం నుంచి కొడుకు కేసీఆర్, మేనల్లుడు టి.హరీశ్ రావు మంత్రులుగా ఉన్నారు. 

ఇప్పుడు కవితకు కూడా ఛాన్స్ ఇస్తే కుటుంబ పాలన అని ఇప్పటికే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు చెలరేగిపోతాయి. కానీ జరగబోయే వివిధ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధిస్తే కేసీఆర్ ఈ విమర్శలను లెక్కచేయకపోవొచ్చు. 

మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీ దేవిని మంత్రిని చేస్తారని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఒకవేళ మంత్రిపదవి కుదరకపోతే శాసనమండలి చైర్మన్ పదవి ఇస్తారని అనుకుంటున్నారు. ఆమెకు ఏదో ఒక పదవి గ్యారంటీ అని ఎక్కువమంది భావిస్తున్నారు. 

సీఎం కేసీఆర్ ప్రధానంగా ముగ్గురు లేదా నలుగురు మంత్రులపై అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. వారిలో ఒకరు గ్రేటర్ హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే, మరొకరు కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలిసింది. మరికొందరిని కూడా తప్పించి కొత్తవారికి ఛాన్స్ ఇస్తారని సమాచారం. మరి మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ ఎలా జరుగుతుందో చూడాలి. మార్పులు చేర్పులు చేశాక ఆ మంత్రివర్గంలోని ఆయన ఎన్నికలకు వెళతారు.