పేరుకే అమరావతి పరిరక్షణ! చేష్టల్నీ అమరావతి పరిభక్షణే అనే విమర్శలు రాజధాని ప్రాంత ప్రజానీకం నుంచి వెల్లువెత్తడం గమనార్హం. అమరావతిని కాపాడుకోవడాన్ని విస్మరించి, టీడీపీ రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించడానికే అమరావతి పరిరక్షణ సమితి తపిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లులు తీసుకొచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా అమరావతి పరిరక్షణ సమితి ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టింది.
ఇందులో భాగంగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించ తలపెట్టింది. ఈ కార్యక్రమానికి అమరావతి పరిరక్షణ సమితి నేతలు సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, బీజేపీ నేతల్ని మాత్రమే ఆహ్వానించడం గమనార్హం. అమరావతికి కర్త, కర్మ, క్రియ అన్నీ తానై నడిపించిన టీడీపీ, అలాగే మద్దతుగా నిలిచిన జనసేన నేతల్ని ఆహ్వానించకపోవడం వెనుక ఉద్దేశం ఏంటి? అనే ప్రశ్న ఉత్పన్నమైంది.
ఏడాదిన్నరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అమరావతే ఏకైక రాజధాని అంటే, మిగిలిన ప్రాంతాల్లో రాజకీయంగా టీడీపీకి నష్టం వస్తుందని అమరావతి పరిరక్షణ సమితి భావన. దీంతో అరసవిల్లికి చేపట్టిన పాదయాత్రను అర్థంతరంగా నిలిపేశారు. తాజాగా ఢిల్లీ వరకే నిరసనను పరిమితం చేశారు. అలాగే ఢిల్లీ నిరసనలకు టీడీపీని వ్యూహాత్మకంగా ఆహ్వానించలేదనే చర్చకు తెరలేచింది. అమరావతితో టీడీపీకి ఎలా సంబంధం లేదనే సంకేతాల్ని పంపడానికి అమరావతి పరిరక్షణ సమితి నేతలు పరితపిస్తున్నారు.
అమరావతిని అడ్డం పెట్టుకుని ఉద్యమ నాయకులు సొంతిళ్లను చక్కగా పరిరక్షించుకున్నారని ఆ సంస్థలోని దళిత నేతలు విమర్శిస్తున్నారు. అమరావతి పరిరక్షణ సమితి నాయకత్వం పూర్తిగా అగ్రకులాల చేతల్లో వుంది. విరాళాల సేకరణ, ఖర్చులు, ఇతరత్రా ఆర్థిక వ్యవహారాలను అగ్రకులాల నేతలే చూసుకుంటున్నారు. దళితులు, ఇతర అణగారిన వర్గాలు కేవలం నాయకుల పల్లకీలు మోయడానికే పరిమితం చేయడం విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో అమరావతి ఉద్యమాన్ని దిగ్విజయంగా ఆ పేరుతో పెట్టుకున్న పరిరక్షణ సమితి నేతలు నీరుగార్చారనే విమర్శలకు అనేక రుజువులు చూపొచ్చు.