రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయనేది ఎందరో తలపండిన రాజకీయ నేతలు చెప్పే మాట. ఈ సామెత వందకు వందశాతం రుజువు అని నిరూపిస్తోంది తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. పోటీ చేస్తేనే కదా ఓడిపోయారనేది, పోటీనే చేయకపోతే ఓడిపోయే సమస్యే లేదు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు ప్రాదేశిక ఎన్నికలను తన పార్టీ బహిష్కరించిందని ప్రకటించారు.
అదేమంటే తమిళనాట జయలలిత ఎప్పుడో ఉప ఎన్నికలను బహిష్కరించిందట, ఆ తర్వాత ఆమె సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిందట.. ఇప్పుడు టీడీపీ కూడా అంతేనట! అయినా అరవదేశం రాజకీయాలకూ తెలుగు రాజకీయాలకూ ఏ మాత్రం సంబంధం ఉండదు. తమిళుల తీరు వేరే. ఇది వేరే చెప్పనక్కర్లేని అంశం. కేవలం తమ పలాయన వాదాన్ని సమర్థించుకోవడానికి జయలలితను ఉదాహరిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఈ వాదనతో బయట వాళ్లను కన్వీన్స్ చేయడం మాట అటుంచితే, తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులనే కన్వీన్స్ చేయలేకపోతున్నట్టుంది. ఇప్పటికే ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థిత్వం కోసం నామినేషన్లను వేసిన అభ్యర్థుల్లో చాలా మంది తాము పోటీలో ఉన్నట్టే అని ప్రకటించుకున్నారు. స్వయంగా తెలుగుదేశం అధికారిక పత్రికే ఈ విషయాన్ని ప్రచురించింది.
పలు జిల్లాల్లో తెలుగుదేశం బీ ఫారం మీద నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు తాము పోటీలో ఉన్నట్టే అని ప్రకటించుకున్నారట. ఈ విషయాన్ని పచ్చపత్రికే ధ్రువీకరించడంతో కొత్త గందరగోళానికి తెరలేస్తోంది. కొంతమందేమో తాము తెలుగుదేశమే అని, తాము పోటీలో ఉన్నట్టే అని ప్రకటించుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో మిగతా వాళ్లు పోటీలో ఉండాలా, వద్దా అనే గందరగోళానికి గురవుతున్నట్టుగా తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన వారిలో కూడా కనీసం కొంతమందికైనా విజయం మీద ఆశలుంటాయి. విజయంపై చంద్రబాబుకు కాన్ఫిడెన్స్ లేకపోయినా అభ్యర్థుల్లో ఉండటంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఈ నేపథ్యంలో.. చంద్రబాబు ప్రకటించిన బహిష్కరణ పిలుపు పట్ల సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ ఉన్నాయి.
ఓటమి తప్పదనుకునే వాళ్లు ఖర్చు మిగులును దృష్టిలో ఉంచుకుని తప్పుకోవచ్చు గాక, అంతో ఇంతో ఆశలున్నవారు మాత్రం.. అధినేత పిలుపును పాటించాలో, లేదు పోటీలో ఉంటామంటున్న కొంతమంది నేతలను ఫాలో కావాలో తెలయని పరిస్థితుల్లో ఉండవచ్చు.
ఒకవైపు చంద్రబాబు చేసుకున్న ఈ సెల్ఫ్ గోల్ ఫలితంగా తెలుగుదేశం పార్టీ భవితవ్యం ఏమిటనే చర్చ ఒకవైపు సాగుతూ ఉండగా, చంద్రబాబు నిర్ణయాన్ని పచ్చచొక్కాలే బాహాటంగా తప్పు పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉన్నారో ఈ మధ్యకాలంలో ఆయన మాటలు, మున్సిపల్ ఎన్నికల ప్రచారంలోని ఆయన ప్రసంగాలే చాటి చెప్పాయి.
ఆ పరిస్థితుల్లోనే ఆయన బహిష్కరణ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా ఉన్నారు. ఇది తెలుగుదేశం పార్టీ భవితవ్యాన్నే ప్రశ్నార్థకంగా మార్చడంలో పెద్ద వింత లేదు.