కాపునాడు సమావేశాలు హైదరాబాద్, విశాఖల్లో జరగడంతో వార్తలు అన్నీ అటుగా మళ్ళాయి. అసలు ఏం జరుగుతోంది అన్న ప్రశ్నలు వినిపించడం ప్రారంభమైంది. తుని సంఘటన తరువాత కాపు నాడు అనేది పెద్దగా వినిపించడం తగ్గిపోయింది. అప్పుడప్పుడు ముద్రగడ లేఖలు తప్ప మరి హడావుడి లేదు. గత ఎన్నికల్లో మాదిరిగా కాకుండా 2023 ఎన్నికల్లో కాపు ఓట్లు తన దగ్గరకి చేరాలి అనే ఆలోచనతో జనసేన అధిపతి పనన్ కళ్యాణ్ మాట్లాడడం ప్రారంభించారు. బాహాటంగానే కాపు ఓట్ల కోసం అన్నట్లుగా ఆయన ప్రసంగాలు సాగడం ప్రారంభమైంది.
ఇదిలా వుండగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కూడా కులాల వారీగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ మాత్రం పార్టీల వారీగా నాయకుల ప్రకటనలే తప్ప సభలు సమావేశాలు నిర్వహించే ఆలోచన ప్రస్తుతానికి చేయడం లేదు.
ఇలాంటి నేపథ్యంలో ఉన్నట్లుండి కాపునాడు అనే కార్యాచరణ ప్రారంభమైంది. తొలుత హైదరాబాద్ లోని ఓ హోటల్ లో అరడజను మంది సమావేశం అయ్యారు. వీరిలో కీలకమైన వ్యక్తి గంటా శ్రీనివాసరావు. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ నేత కావడంతో అందరి దృష్టి అటు మళ్లింది. పైగా ఇప్పుడు రెండో సమావేశం విశాఖలో జరగడం, అది కూడా గంటా నేతృత్వంలో, గంటా ఇంట్లోనే జరగడంతో కాస్త అందరి దృష్టి అటు పడేలా చేసింది.
అసలు ఇంతకీ ఈ కాపునాటు లక్ష్యం ఏమిటి? కాపుల ఓట్ల ఐక్యత మాత్రమేనా? లేక రాజకీయంగా కాపుల తీసుకోవాల్సిన పార్టీ స్టాండ్ ను డిసైడ్ చేస్తుందా? చేస్తే తెలుగుదేశానికి అనుకూలంగానా? వైకాపా లేదా జనసేన కోసమా? అన్న ప్రశ్నలు వుండనే వున్నాయి. ఇవన్నీ అంత సులువు సమాధానాలు దొరికే ప్రశ్నలు కావు. సమాధానాలు కావాలంటే చాలా వెనక్కు వెళ్లి లెక్కలు తీయాల్సి వుంటుంది.
గంటా అంటే మంట
గత ఎన్నికల్లో వైకాపా కు ఎదురీది గెలిచిన గంటా శ్రీనివాసరావు అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీతో దోబూచులాడుకుంటూ వస్తున్నారు. నియోజకవర్గానికి అంటీ ముట్టనట్లుగా, పార్టీతో వుండీ వుండనట్లుగా పని జరిపిస్తున్నారు. అడపా దడపా వైకాపాలోకి దూకడానికి రెడీ అనే ఫీలర్లు వుండనే వున్నాయి. దాంతో తెలుగుదేశం పార్టీ దాదాపుగా గంటాను వదిలేసింది. గంటా అంటే పడని మరో లీడర్ అయ్యన్నపాత్రుడు అన్ని విధాలుగా పార్టీలో అప్పర్ హ్యాండ్ తీసేసుకున్నారు.
గంటా వైకాపాలోకి వెళ్దామనుకుంటే విజయసాయిరెడ్డి అడ్డంగా కూర్చున్నారు. అన్నీ కుదుర్చుకుని వైకాపాలోకి వెళ్లడానికి రూట్ క్లియర్ చేసే టైమ్ కు భవిష్యత్ ఎలా వుంటుందో అన్న అనుమానం మొదలయింది. అధికారంలోకి ఏ పార్టీ వస్తుందంటే అందులోనే వుండడానికి గంటా ఇష్టపడతారని రాజకీయ వర్గాలు అంటుంటాయి.
తేదేపాలో తన పరిస్థితి అంత గొప్పగా లేదని గంటాకు తెలుసు. జనసేనలోకి వెళ్లాలనే వుంది కానీ అక్కడ కూడా పవన్ కు నప్పదు. అది క్లారిటీ. ఆ మధ్య విశాఖలో పవన్ వ్యవహారం గడబిడ అయినపుడు కలుద్దామనే నోవాటెల్ కు వెళ్లినట్లు బోగట్టా. కానీ పవన్ తనను కలవడానికి అనుమతి ఇవ్వలేదు.
అదే కారణం
ప్రజారాజ్యం పార్టీ ని కాంగ్రెస్ లో కలిపిన తరువాత చిరంజీవి బాగానే వున్నారు. కేంద్ర మంత్రి అయ్యారు. గంటా కూడా మంత్రి అయ్యారు. కానీ ప్రజారాజ్యం కాంగ్రెస్ లో కలిపేయడానికి కారణం గంటా, కన్నబాబే అన్న స్థిర అభిప్రాయంలో పవన్ కళ్యాణ్ లో స్థిరపడిపోయింది. అప్పటి నుంచి కన్నబాబు, గంటా అంటే పవన్ కు అస్సలు పడదు. అందువల్ల గంటాకు జనసేనలోకి ఎంట్రీ అంత సులువు కాదు.
తేదేపాలో ఇప్పటికే చాలా వరకు తలుపులు మూసుకున్నాయి. పార్టీ శ్రేణులు గంటాను అంతగా ఇష్టపడడం లేదు. కానీ గంటా అటు భీమిలి లేదా ఇటు చోడవరం స్థానాలు కోరుతూ ఇక్కడ అక్కడి ప్రయత్నాలు అక్కడ చేస్తున్నారు. మరోపక్కన వైకాపాలోకి వెళ్లడమా? మానడమా? అనే డైలమా వుండనే వుంది.
బలం కోసమే
ఇలాంటి పరిస్థితుల్లో తనను తను బలోపేతం చేసుకోవడం కోసం గంటా ఇప్పుడు కాపునాడు కార్డ్ బయటకు తీసినట్లు కనిపిస్తోంది. నిజానికి తెలుగుదేశంలోకి మొట్టమొదటిసారి ఎంట్రీ ఇచ్చినపుడు ఆయనకు తన కులం కార్డు కన్నా, తన సతీమణి సామాజిక వర్గ కార్డ్ బాగా ఉపయోగపడిందని రాజకీయ వర్గాల్లో వినిపిస్తూ వుంటుంది. ప్రస్తుతానికి అయితే కాపునాడునే గంటా నమ్ముకున్నారు. కాపునాడు లీడర్ గా ఎదగాలని, అలా ఎదిగి ఇటు తెలుగుదేశం లేదా అటు జనసేన వైపు నుంచి రంగంలోకి దిగాలని యోచిస్తున్నారు.
ఆయన ఆలోచన ఎలా వున్నా, గంటా కాపునాడు మంత్రాంగం వెనుక వైకాపా కూడా వుందనే వార్తలు వుండనే వున్నాయి. జనసేన విడిగా చేసినా, తేదేపాతో కలిసి పోటీ చేసినా, కొంత శాతం అయినా కాపు ఓటు బ్యాంక్ ను తమ వైపు తిప్పుకోవాలన్నది వైకాపా యోచనగా వుంది. జనసేన-తేదేపా కలవకపోతే కాపు ఓటు బ్యాంక్ మూడు ముక్కలు అవుతుంది. మేజర్ షేర్ జనసేనకు వెళ్లొచ్చు. ఆ తరువాత అంతో ఇంతో షేర్ వైకాపాకు దక్కుతుంది.
బిసి లు బలోపేతం
కాపునాడు హడావుడి షురూ కావడం అన్నది రాజకీయంగా మరింత జోరు అందుకోవడానికి దారి తీస్తుంది. బిసి లను వైకాపా దాదాపుగా తన వైపు తిప్పుకుంది. అందులో వాటా కోసం తేదేపా ప్రయత్నిస్తోంది. జనసేన ఇక బిసి ఓటు బ్యాంకును వదిలేసుకున్నట్లే. కాపుల పార్టీ అనే ముద్ర దాదాపుగా జనసేనకు పడిపోయినట్లే. ఆ పార్టీ కూడా అందుకు సిద్దపడి, అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్తోంది.
బహుశా ఇది తేదేపా వ్యూహం కావచ్చు. కాపు ఓట్లను పవన్ తీసుకువస్తే, బిసి ఓట్లను తాము తెచ్చుకుని వైకాపాను ఓడించవచ్చు అనే ఆలోచన కావచ్చు. కానీ పవన్ తొ కలిస్తే తేదేపా వైపు బిసి లు ఎందుకు చూస్తారనే ప్రశ్న కూడా వుండనే వుంది.
మొత్తం మీద రెండేళ్ల ముందుగానే ఆంధ్ర నాట కుల రాజకీయం ఙోరందుకుంది. ఇది ఇంకా ఏ దిళగా మందుకు సాగుతుందో చూడాలి.