నలభై ఎనిమిది గంటలు టైమ్ ఇస్తున్నా, రాజధాని విషయంలో డెసిషన్ మార్చుకోవాలి లేదూ అంటే మళ్లీ ఎన్నికలకు రెడీ కావాలి అంటూ అల్టిమేటమ్ ఇచ్చారు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. నలభై ఎనిమిది గంటల తరువాత ఏం చేస్తారు? అంటే చేసేదేమీ వుండదు. కోర్టులకు వెళ్లడం తప్ప. అది వేరే సంగతి. అసలు తన చేతిలో వున్న 23 మంది చేత ఎందుకు తక్షణం రాజీనామా చేయించడం లేదు? ఇక్కడే వుంది అసలు సిసలు లాజిక్.
అసలు రాజీనామా చేయమంటే 23 మందిలో ఎంత మంది నాయుడు బాబు మాట వింటారో తెలియదు. అప్పుడు అనవసరంగా పరువు పోతుంది. ఇక్కడ అసలు ముచ్చట మరోటి వుంది. జగన్ ఎవరన్నా పార్టీలోకి వస్తాము అంటే రాజీనామా చేసి రండి అని క్లియర్ మెసేజ్ ఇచ్చేసారు. రాజీనామా చేసి వస్తే, మళ్లీ తాను గెలిపించుకుంటా అంటున్నారు. ఇప్పుడు ఈ 23 మందిలో చాలా మంది ఈ విషయంలో అటు ఇటు ఊగుతున్నవారు వున్నారు.
ఇప్పుడు నాయుడు బాబు కనుక రాజీనామా చేయమంటే, ఇంకెందకు ఆ చేసేదేదో చేసి, జగన్ దగ్గరకు వెళ్లిపోతాం అంటే…? కృష్ణ, గుంటూరు జిల్లాలను పక్కన పెడితే మిగిలిన ప్రాంతాల్లో ఈ సమస్య రావడానికే ఎక్కువ అవకాశం వుంది. అందుకే నాయుడు బాబుగారు మొత్తం రాజీనామా చేసేద్దాం అంటున్నారు తప్ప, తమ పార్టీ వాళ్లు ముందుగా రాజీనామా చేసి, అదే రెఫరెండం అనే ప్రయత్నం చేయడం లేదు.