ఒకే దెబ్బకు రెండు పిట్టలు టైపులో ఒకేసారి అటు ప్రియుడ్ని చంపడంతో పాటు, ఇటు భర్తను కూడా వదిలించుకోవాలని చూసిన కిలాడీ లేడీ పన్నాగాన్ని పోలీసులు పసిగట్టారు. 10 రోజులుగా మర్డర్ మిస్టరీ సినిమాను తలపించిన గుంటూరు పురుగు మందుల వ్యాపారి హత్య కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు.
పిడుగురాళ్లకు చెందిన పురుగు మందుల వ్యాపారి పూర్ణచంద్రరావుకు, అదే మండలానికి చెందిన గుత్తికొండలో ఉంటున్న ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. పూర్ణచంద్రరావు కోసం ఆమె భర్తను వదిలి గుంటూరు వచ్చేసింది. ఆ తర్వాత కొన్నాళ్లకు పూర్ణచంద్రరావు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయినా, ఈ మహిళతో అక్రమ సంబంధాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు.
అయితే పదేళ్ల కిందట గుంటూరుకు చెందిన మరో వ్యక్తిని పెళ్లాడింది ఈ మహిళ. ఓ వైపు రెండో భర్తతో కాపురం చేస్తూనే, మరోవైపు పూర్ణచంద్రరావుతో ఎఫైర్ కూడా కొనసాగిస్తూ వస్తోంది. అయితే ఈ విషయం భర్తకు తెలిసింది. ఎలాగైనా పూర్ణచంద్రరావును అడ్డుతొలిగించుకోవాలనుకున్నాడు. అయితే భార్య మాత్రం మరో విధంగా ఆలోచించింది. అటు పూర్ణచంద్రరావును చంపడంతో పాటు, ఇటు భర్తను కూడా బుక్ చేస్తే అతడి చీటి బిజినెస్ డబ్బులు మొత్తం కాజేయొచ్చని భావించింది.
చీటి డబ్బులు ఇస్తానంటూ పూర్ణచంద్రరావును ఇంటికి పిలిచింది. అప్పటికే మాట్లాడి పెట్టుకున్న రౌడీషీటర్ రాజేష్ సహాయంతో పూర్ణచంద్రరావును హత్య చేసింది. ఈ హత్యను తన భర్తపై నెట్టేందుకు, భర్త ఆధార్ కార్డ్, ఓటరు కార్డు, కరెంట్ బిల్లుల్ని పూర్ణచంద్రరావు మృతదేహంతో పాటు గోనె సంచెలో పెట్టి పంట కాల్వలో పడేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు 10 రోజుల పాటు దర్యాప్తు చేసి అసలు నిందితురాల్ని అరెస్ట్ చేశారు. ఆమెకు సహకరించిన రౌడీ షీటర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు.