‘మా’ ఎన్నికల రచ్చకు తెరపడలేదు. ఇవాళ సాయంత్రం ప్రకాశ్‌రాజ్ ప్యానల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటుడు ప్రభాకర్ ఆవేదనతో పాటు ఆవేశంతో మాట్లాడారు.
తమ ప్యానల్ సభ్యులు బెనర్జీ, తనీష్‌లతో విలక్షణ నటుడు మంచు మోహన్‌బాబు వ్యవహరించిన తీరును తప్పు పట్టారు. ఇండస్ట్రీలో ప్రశ్నిస్తే 20 ఏళ్ల వెనక్కి పోవాల్సి వస్తుందనే భయంతో రాజీపడి బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే మోహన్‌బాబు దురుసు ప్రవర్తనపై తన ఆగ్రహాన్ని ఆయన ఆపుకోలేకపోయారు. మోహన్‌బాబుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అలాగే మోహన్‌బాబు కుమారులు మంచు విష్ణు, మనోజ్‌లు ఎంతో హూందాగా వ్యవహరించారని పొగడ్తలతో ముంచెత్తారు. ప్రభాకర్ ఏమన్నారో ఆయన మాటల్లోనే…
‘మోహన్‌బాబు తిట్లు వింటుంటే రక్తం మరిగిపోయింది. కానీ ఏం చేయలేని పరిస్థితి. అటువైపు తండ్రిలాంటి వ్యక్తి. ఎదురు మాట్లాడితే 20 సంవత్సాలు వెనక్కి వెళ్లాం. ఆల్రెడీ నాకు అనుభవం ఉంది. తప్పు చేయకపోయినా సరే ఎదురు మాట్లాడితే వెనక్కి వెళ్లిపోతాం. కొండను ఢీకొట్టాలంటే అంత ఈజీ కాదు. వేల మందిలో ఒకడికే సాధ్యమవుతుంది. నేనున్నాను, నా పిల్లలు కూడా ఇండస్ట్రీకి వస్తున్నారనే ఒక భయం. వదిలేశాం. కాంప్రమైజ్‌అయ్యాం’
‘ఎన్నికల రోజు మాత్రం మంచు మనోజ్, మంచు విష్ణు లేకుంటే మీరు చూసిన రచ్చ ఆఫ్ట్రాల్ అయి ఉండేది. హ్యాట్సాఫ్ టు మనోజ్.. మనోజ్ లేకుంటే కొట్టుకుని చచ్చేవాళ్లు. మనోజ్ చాలా కంట్రోల్ చేశారు’ అంటూ ప్రభాకర్ ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు ఎంతో సంయమనం పాటించిన బెనర్జీ, ప్రకాశ్‌రాజ్‌ను ప్రభాకర్ అభినందించారు. నటుడి ప్రభాకర్ కామెంట్స్‌పై మంచు కుటుంబ స్పందన ఏంటో చూడాలి.